వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సారధ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు నిర్విరామంగా నిర్విఘ్నంగా అలుపెరగని కృషి వల్ల నేటికి నూటా యాబైయవ రోజుకు చేరుకుంది.
ప్రొద్దుటూరు మునిసిపల్ పరిధిలోని పదమూడవ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. మైదుకూరు రోడ్డులోని దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ కేకు కట్ చేసి అనంతరం రాచమల్లును భారీ గజమాలతో సన్మానించారు, అడుగడుగునా బాణాసంచా పేలుస్తూ, పూల వర్షం కురిపిస్తూ, అభిమానుల కోలాహలం మధ్య కార్యక్రమం ఆధ్యంతం ప్రజలకు చేరువై వారికి అందుతున్న సంక్షేమ పధకాల తీరును పరిశీలిస్తూ సాగింది. పల్నాడు జిల్లా నుండి రప్పించిన తప్పేట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజలను ఉద్దేశించి వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. ప్రత్యేకించి ఎమ్మెల్యే రాచమల్లు నియోజకవర్గంపై చూపిస్తున్న శ్రద్ధను, మైనారిటీలను అక్కున చేర్చుకుంటున్న ఆయన అభిమానాన్ని కొనియాడారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పధకాలు అందించటంలో తమ వైసీపీ ప్రభుత్వం ముందంజలో వున్నదని, పలు పధకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, నియోజకవర్గంలోని దాదాపు అన్ని వార్డులలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు మెండుగా శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో ప్రొద్దుటూరు ప్రజలకు మైలవరం డ్యామ్ నుండి శాశ్వతంగా మంచినీరు అందించే అమృత్ పధకాన్ని నూట ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో, ప్రజలకు అంకితం చేయనున్నట్లు ఆయన తెలిపారు. తనను ఎంతగానో ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో పెద్దఎత్తున వైసీపీ నాయకులు, మునిసిపల్ వార్డు కౌన్సిలర్లు, మండల నాయకులు, రాచమల్లు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Comments