ప్రాణాలు తీసిన ఈత సరదా
ఊటుకూరు చెరువులో ఇద్దరు యువకులు మృతి
ఒకరి మృతదేహం లభ్యం, మరొకరి కోసం గాలింపు చర్యలు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఈత సరదా రెండు ప్రాణాలను బలిగొన్నది. పాలిటెక్నిక్ పూర్తి చేసి భవిష్యత్తుపై కలలుగంటున్న యువకుడు ఒకరైతే.. కడప ఆర్డీవో కార్యాలయంలో తండ్రి స్థానంలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న యువకుడు మరొకరు. స్నేహితులతో కలిసి ఆదివారం సరదాగా నలుగురు యువకులు ఆదివారం మధ్యాహ్నం మండల పరిధిలోని ఊటుకూరు చెరువు లోకి ఈతకు వెళ్లారు. కార్తీక్, హేమంత్ అనే యువకులు ఒడ్డున ఉండగా యశ్వంత్ కుమార్ ధనుష్ లు ఈతకు వెళ్లినట్లు సమాచారం. చెరువులో అక్కడక్కడా గుంతలలో నీరు ఉండడంతో ఆ గుంతల్లోనే ఈత కొడుతూ లోతు ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లడంతో కాసేపటికే యశ్వంత్ కుమార్ (23), ధనుష్ (20) అనే యువకులు గళ్ళంతైనట్లు సమాచారం.
మిగిలిన ఇద్దరు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు హుటా హుటిన అర్బన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టి యశ్వంత్ కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. ధనుష్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. యశ్వంత్ కుమార్ పాలిటెక్నిక్ చేసి తండ్రి మరణించడంతో తల్లి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తూ కుమారుడికి ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కనిపించకుండా పోయిన ధనుష్ పట్టణంలోని గంగిరెడ్డిపాలెం లో ఉంటూ కడప నగరంలోని ఆర్డిఓ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న తన తండ్రి కృష్ణ పక్షవాతంతో మంచాన పడడంతో తండ్రి స్థానంలో కడపలో విధులు నిర్వర్తిస్తూ ఉండేవాడని, ప్రతిరోజు రాజంపేట నుంచి కడపకు వెళ్లి వచ్చేవాడని, ఆదివారం సెలవు కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని ధనుష్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Comentários