మన 'పూతరేకుల'కు జీఐ ట్యాగ్
- ఏపీ ఆత్రేయపురం 'పూతరేకులు' కు జీఐలో స్థానం
- లోక్సభలో ఎంపీ భరత్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సోం ప్రసాద్ సమాధానం
ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ మేరకు జియోలాజికల్ ఇండికేషన్స్ (జీఐ) ట్యాగ్ సంస్థ వెల్లడించినట్లు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి సోం ప్రకాష్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ మంత్రి సోం ప్రసాద్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సర్ ఆర్ధర్ పత్తి ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల సంక్షేమ అసోసియేషన్ జీఐ ట్యాగ్ కోసం 2021, డిసెంబరు 13న చేసుకున్న దరఖాస్తును స్వీకరించి రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలిపారు. దరఖాస్తు పరిశీలన తదితర లాంఛనాల అనంతరం ఈ సంవత్సరం జూన్ 14న ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ (సర్టిఫికేట్ నెంబర్ 483) మంజూరు చేయబడిందని ఎంపీ భరత్ కు ఆ లేఖ ద్వారా కేంద్ర మంత్రి సోం ప్రకాష్ తెలిపారు. ఇది ఆత్రేయపురం వాసులకే కాకుండా పూర్వపు తూర్పు గోదావరి జిల్లా వాసులకు, ఏపీ రాష్ట్ర ప్రజలకు గర్వకారణమైన విషయమని ఎంపీ భరత్ ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధ మిఠాయిగా పూతరేకులకు గుర్తింపు ఉందన్నారు. కొన్ని ప్రాంతాలలో వీటిని పొర బుట్టలు, పేపర్ స్వీట్స్ అని రకరకాలుగా పిలుస్తుంటారని తెలిపారు. పూతరేకుల తయారీకి దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉందని, పూతరేకులు తయారీ కుటీర వృత్తిగా చేస్తూ అనేక కుటుంబాలు ఆత్రేయపురం మండలంలో జీవనం సాగిస్తున్నాయని ఎంపీ భరత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొండపల్లి బొమ్మలు, తిరుపతి లడ్డూ, ఉప్పాడ జిందానీ చీరలు, బందరు లడ్డూ.. ఇలా 18 ప్రాంతాలలో చారిత్రక నేపథ్యం ఉన్న వాటిని జీఐ ట్యాగ్ సంస్థ గుర్తించగా, తాజాగా ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ చోటు లభించడంతో మొత్తం19 ప్రాంతాలకు అరుదైన భౌగోళిక గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో గెజిట్ విడుదల కావచ్చునని ఎంపీ భరత్ తెలిపారు.
Comments