ఆదిత్య బిర్లా కంపెనీతో 2 వేల ఉద్యగాలు : సీఎం జగన్
కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం నాడు పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో రూ.110 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులను చారిత్రాత్మక ఘటనగా సీఎం జగన్ అభివర్ణించారు. పులివెందులకు మంచి కంపెనీ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల ఉద్యోగాలు లభిస్తాయని జగన్ తెలిపారు.
ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఆదిత్య బిర్లా సంస్థ కూడా ఒకటని సీఎం జగన్ వివరించారు. భవిష్యత్‌లో ఒక్క పులివెందులలోనే 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని జగన్ ప్రకటించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు జగన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. అటు పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
Comments