వలసల జిల్లాలో సీట్లు పెంచి బాలికల చదువును ప్రోత్సహించండి - జిల్లా వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన ఏఐఎస్ఎఫ్
నిత్యం వలసలతో,కరువుతో కొట్టుమిట్టాడుతున్న కర్నూలు జిల్లాలో ఉన్న కస్తూరిభా పాఠశాలల్లో ఉన్న అడ్మిషన్ల తో పాటు అదనంగా సీట్లు పెంచాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా మంత్రాలయం తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి తహశీల్దార్ చంద్రశేఖర్ ని కలిసి వినతిపత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్,జిల్లా సహాయ కార్యదర్శులు షాభిర్ బాషా, థామస్ లు మాట్లాడుతూ జిల్లాల విభజన తర్వాత రాష్ట్రంలోనే అత్యంత కరువు జిల్లా కర్నూలు జిల్లానే అని,జిల్లాలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా పూర్తిగా వెనుకబడిన వారు అమ్మాయిలను చదివించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళల చదువు మధ్యలోనే ఆపివేసి పెళ్లిళ్లు చేసేస్తున్నారని, బాలికల విద్యకోసం ఏర్పాటు చేసిన కస్తూరిభా పాఠశాలల్లో చదివేందుకు జిల్లాలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వారికి అడ్మిషన్లు ఇవ్వకపోతే బెంగుళూరు, ముంబాయి, గోవా, కేరళ, హైదరాబాద్, గుంటూరు లకు వలసలకు వారి తల్లిదండ్రులతో పాటు మహిళలను తీసుకెళుతున్నారని అన్నారు.
అటువంటి వారిని గుర్తించి వారికి కస్తూరిభా పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పిస్తే చదువుకొని సమాజానికి ఉపయోగపడతారని, బాలికల విద్య మరింత మెరుగుపరచడానికి మంచి అవకాశం ఉందని,ఇతర జిల్లాల మాదిరిగా కాకుండా కర్నూలు జిల్లాను ప్రత్యేకంగా చూసి కేజీబీవీ పాఠశాలల్లో అదనంగా ఒక్కో పాఠశాలకు 20 సీట్లు ఇవ్వాలని, అప్పుడే మరికొందరి మహిళలు చదువుకునే అవకాశం దొరుకుతుందని సీట్లు పెంచితే ఇక్కడి మహిళ విద్యాభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని, జిల్లాలో ఆలూరు, ఆదోని,మంత్రాలయం, పత్తికొండ లాంటి ప్రాంతాల్లో అనేకమంది మహిళలు డ్రాపౌట్స్ ఉన్నారని, వారందరికి కేజీబీవీ లో చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాలో సీట్ల పెంపుదల కోసం ప్రజాప్రతినిధులు కూడా సీట్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని వారు తెలిపారు.ఈ వినతిపత్రం అందచేసిన వారిలో ఏఐఎస్ఎఫ్ రహిమాన్ బాషా, రవితేజ, వీరేష్, బలరాం, ఉరుకుందు, మోహన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments