ఆజాదీకా అమృత్ మహోత్సవం లో భాగంగా... ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలు.
-విద్యార్థులచే భారీ ర్యాలీ, మానవహారం, చిత్రపటానికి నివాళులు.
ఎందరో అమర జీవుల త్యాగఫలం భారతదేశానికి స్వాతంత్ర దినం. అట్టి స్వాతంత్రం సిద్ధించి మన దేశానికి 2022 ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఎందరో త్యాగధనుల కీర్తిని స్మరిస్తూ దేశ ప్రజల్లో దేశం పట్ల జాతీయ భావాన్ని పెంపొందించేందుకు 75 వారాలపాటు" ఆజాదీకా అమృత మహోత్సవం" అన్న పేరుతో దేశ నలుమూలల ఈ కార్యక్రమానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అంకురార్పణ చేశారు. కాగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని కార్యాలయాల లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ రోజున అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశం ఆదేశాల మేరకు చిట్వేలి మండలంలోని మండల అధికారులు, ఉపాధ్యాయులు, సహ ఉపాధ్యాయులు తదితరులు పాఠశాల విద్యార్థులతో కలిసి మూకుమ్మడిగా ఉన్నత పాఠశాల ఆవరణ నుంచి వైయస్సార్ సర్కిల్ వరకు... జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 146 వ జయంతిని పురస్కరించుకొని జాతీయ జెండాను చేతపూని స్వాతంత్ర సమరవీరులకు అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
మండల తాసిల్దార్ మురళీకృష్ణ,మండల అభివృద్ధి అధికారి మోహన్,మండల ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ..పింగళి వెంకయ్య తెలుగు జాతి వారు కావడం మనందరికీ గర్వకారణమని,స్వాతంత్రం పొందిన తరువాత మన దేశం సాదించిన ప్రగతినీ గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య వంతులను చేయడం ఈ మహోత్సవాల ప్రత్యేక ఉద్దేశ్యమని అన్నారు.ర్యాలీ అనంతరం చిట్వేలి పాతబస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి రమణ , ఉన్నత పాటశాల ప్రధానోపాద్యాయులు క్రిష్ణమూర్తి, ఉపాధిహామీ సిబ్బంది ,సి అర్ పి లు, పోలిస్ సిబ్బంది , ఉపాద్యాయులు , మండల పరిషత్, సచివాలయ సిబ్బంది విద్యార్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .
Comments