అమ్మ ఒడి తర్వాత అంగన్వాడీ లే అత్యంత కీలకమని ఐ సి డి ఎస్ రైల్వేకోడూరు ప్రాజెక్ట్ అధికారిని సి రాజమ్మ తెలిపారు. శనివారం చిట్వేలు మండలం స్థానిక ఎంపిడిఓ కార్యాలయం సభ భవనం లో పూర్వప్రాథమిక విద్యకు సంబంధించిన శిక్షణా తరగతులను ఆమె ప్రారంభించారు. మండలంలోని 72 మంది అంగన్వాడీ టీచర్లు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకించి ఆటపాటలు ద్వారా విద్యను బోధిస్తూ పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి, అదేవిధంగా భాషాభివృద్ధికి మేధో వృద్ధికి, గణిత అభివృద్ధికి కృషి చేసేలా అంగన్వాడి టీచర్లు కృషి చేయాలని ఆమె కోరారు.
దాదాపు 92 శాతం మెదడు ఎదుగుదల అనేది అంగన్వాడి లో జరుగుతుందని తెలిపారు. కాబట్టి ప్రతి కార్యకర్త నేటి బాలలే రేపటి పౌరులు అనే నగ్నసత్యాన్ని గమనంలో ఉంచుకొని, బాలల పురోభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడి లను వైయస్సార్ ప్రీస్కూల్ గా మారుస్తూ నాణ్యమైన విద్యను ఆట పాటల ద్వారా పిల్లలకు బోధించడానికి బోధనోపకరణాలు, ఆట బొమ్మలు సరఫరా చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా గర్భవతులు, బాలింతలు, 0 నుంచి 6 ఆరు సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి సమగ్రాభివృద్ధికి కృషిచేస్తోందని అన్నారు. ఈ శిక్షణా తరగతులు చిట్వేలు మండలం సూపర్వైజర్ నిర్మల అధ్యక్షతన జరిగాయి.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ గ్రేడ్ వన్ సూపర్వైజర్ అనసూయ, రాజేశ్వరి, వెంకట రత్నమ్మ, గుణవతి ఇంకా మండలంలోని అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. అనంతరం వివిధ ఫ్రీస్కూల్ కార్యక్రమాలను ఆట పాటల ద్వారా టీచర్లచే చేయిస్తూ నిర్వహించడం జరిగింది.
Comments