ఎమ్మెల్యే రాచమల్లు ఇంటి ముందు అంగన్వాడీల ధర్నా
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
అంగన్వాడీ కార్యకర్తలకు చీర-సారే పంచిన కుటుంబం తమదని, రిటైర్మెంట్ నాడు 50వేల రూపాయలు కాదు రెండు లక్షల రూపాయలు అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేసిన వ్యక్తి తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు అంగన్వాడి కార్యకర్తలు సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఇంటి ముందర బైఠాయించి, నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తక్షణం జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లుకు వినతిపత్రం ఇచ్చి తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ ప్రస్తుతం అంగన్వాడీలకు వస్తున్న జీతభత్యాలు సరిపోవు అనటం తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొంటూ, వైసీపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం పేదలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమేనని, అలాంటి నేపథ్యంలో అంగన్వాడీలకు తమ ప్రభుత్వం మొండి చేయి చూపదని, 15 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరసనలు తమ దృష్టికి వచ్చాయని, అంగన్వాడీల జీతం పెంచాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని, అయితే కాస్త సమయం పడుతుందని ఆయన హామీ ఇవ్వటంతో అంగన్వాడీలు ధర్నాను విరమించారు.
Commentaires