*చిట్వేలి లో భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ*
ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు.
చిట్వేలి లో భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు గురువారం బక్రీద్ పండుగను జరుపుకున్నారు, వేకువ జామునే ఈద్గా మైదానం వద్ద మసీదు కమిటీ కార్యనిర్వాహకులు ప్రార్థనలు చేసుకొనుటకు వసతిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు, ఉదయం 8:15 నిమిషాలకు ప్రార్థన సమయం నిర్ణయించగా ముస్లిం సోదరులు అందరూ కలసి ఆనవాయితీగా కాలినడకన ఉదయం 7: 30 నిమిషాలకే ఈద్గా మైదానం చేరుకొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ ,ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రత్యేకంగా దువా చేశారు.
ఈ సందర్భంగా మత బోధకులు మౌలానా జౌహర్ అలీ కాస్మి సందేశిస్తూ 4000 సంవత్సరాల క్రితం ప్రవక్త ఇబ్రహీం అలైహి సలాం వారు వారి కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాం వారు చేసిన త్యాగాల ఫలితమే ఈ బక్రీద్ పండుగని అన్నారు. తండ్రి మాట జవదాటని కుమారుడు మరియు దేవుని అనుగ్రహం మేరకు తన 85 వ ఏట కలిగిన ఏకైక కుమారుడిని సైతం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారని, అలాంటి యుగపురుషుల జీవన శైలిని ఆదర్శంగా తీసుకొని వారి త్యాగాలను స్మరించుకుంటూ సమాజంలో సభ్యత-సంస్కారం, ఒకరి పట్ల మరొకరు దయాగుణంతో మెలగాలని హితబోధ చేశారు.తదనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆ లింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
చిట్వేలు మండలంలో హిందూ ముస్లిం సోదరులు ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటూ అంతా కలిసి మెలసి మధ్యాహ్నం విందు భోజనం చేసి బక్రీదు పండుగ సంబరాలు జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments