top of page
Writer's pictureDORA SWAMY

చిట్వేలి లో భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరుల బక్రీద్ పండగ వేడుకలు.

చిట్వేలి లో భక్తిశ్రద్ధల నడుమ బక్రీదు పండుగ


--ఒకరికొకరు ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు.

-- మత సామరస్యం,అందరి సంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు.

--ముస్లిం సోదరులకు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు.

--ఏర్పాట్లు పర్యవేక్షించిన స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు.




కొందరికి తమ కడుపు నింపు కోవడం పండుగ అయితే మరికొందరికి ఎదుటివారి కడుపు నింపడం పండుగ. తమకోసం తాము అనుకుంటే అంతలో జీవితం ఎలాగూ అయిపోతుంది; ఇతరుల కోసం ఆలోచన చేస్తే మట్టి రేణువులు ఉన్నంతవరకు వారి కీర్తి అజరామరమవుతుంది. అట్టివారిలో ఋషి పుంగవులు,పండితులు, ఇబ్రహీం ప్రవక్త లుగా పేర్కొంటారు. ఆయన జీవితానికి అల్లాహ్ ఆజ్ఞాపాలనకు నిదర్శనంగా ఇస్లాంలోని రెండు పండుగ బక్రీదుగా నిలిచింది


పండుగ విశిష్టత:


అల్లా ముఖ్య ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం ఇస్లాం విశ్వాసాలను ప్రపంచమంతా ప్రచారం చేస్తూ కాలినడకన తిరుగుతూ ఉండేవాడు. ఇబ్రహీంకు పెళ్లి అయినా చాలా ఏండ్ల వరకు సంతానం కలుగలేదు. ఒక రోజు అల్లాను సంతానాన్ని కలిగించమని కోరుతాడు. అల్లా కరుణతో ఓ కుమారుడు జన్మిస్తాడు. అతనికి ఇస్మాయిల్‌ అని నామకరణం చేస్తాడు. చాలా సంవత్సరాల తరువాత జన్మించడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఇబ్రహీం తమ పట్ల ఉన్న విశ్వాసాన్ని పరీక్షించదల్చుకున్న అల్లా వరుసగా మూడు రోజులు అతనికి కలలోకి వస్తాడు. తన ముద్దుల కుమారుడు ఇస్మాయిల్‌ను బలివ్వాలని సందేశాన్ని కలలో వినిపిస్తాడు. ఇబ్రహీం సంకల్పాన్ని అతని భార్య, కుమారుడికి తెలియజేస్తాడు. దీంతో అల్లా కోసం తన తండ్రి తీసుకున్న నిర్ణయానికి దైవ భక్తుడైన ఇస్మాయిల్‌ సంతోషంగా ప్రాణ త్యాగానికి సిద్ధమవుతాడు. దీంతో అల్లా దైవవాణి ద్వారా ఇబ్రహీం ఇది నిన్ను పరీక్షించడానికి మాత్రమే. నా పరీక్షలో నీవు గెలిచావు. నీ కుమారుడికి బదులు ఓ జీవాన్ని (గొర్రె) బలివ్వాలని కోరతాడు. ఆ రోజు నుంచే ఆనవాయితీగా బక్రీద్‌ పండుగ రోజు ఖుర్భానీగా జంతువును బలి ఇస్తారు. ఈ విధంగా బలి ఇచ్చిన జంతు మాంసాన్ని ఒక భాగం పేదలకు మరొక భాగం బంధువులకు మిగిలిన భాగం తమకు ఉంచుకోవడం ఆనవాయితీ.



ఇట్టి బక్రీద్ పండుగను అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలోని అన్ని గ్రామాల ముస్లిం సోదరులు వేకువజాము నుంచే స్థానిక జామియా మసీదు, మదీనా మసీదులలో పత్యేక ప్రార్థనలు నిర్వహించి అల్లాహ్ దయ అందరిపై ఉండాలని అందరూ సామరస్యంగా అన్నదమ్ముల వలె మెలగాలని కోరుకున్నారు. ముస్లిం సోదరులందరూ ఒకరికొకరు ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల పరిధిలోని వివిధ పార్టీల రాజకీయ నాయకులు,ప్రతినిధులు, పాత్రికేయులు, ప్రజలు మండల ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


కాగా స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ముస్లిం సోదరుల ప్రార్ధన మందిరాల్లో పర్యవేక్షించి వారందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రార్థన కార్యక్రమంలో చిట్వేలు మండల పరిధిలోని అన్ని గ్రామాల ముస్లిం సోదరులు, మత పెద్దలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలమధ్య బక్రీద్ పండుగను జరుపుకున్నారు.









198 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page