మోటార్లకు మీటర్లు రైతు మెడకు ఉరితాల్లు - బత్యాల
రూ 57 వేల కోట్ల విద్యుత్ భారం మోపిన జగన్ రెడ్డి ని ఎందుకు నమ్మాలి..?
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్లు బిగించి, రూ 57 వేల కోట్ల చార్జీల భారాలు మోగిన జగన్ రెడ్డిని ఎందుకు నమ్మాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి బత్యాల చెంగల రాయుడు ప్రశ్నించారు.
సోమవారం ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలుతో కలిసి విద్యుత్ చార్జీల భారంపై ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉండే జెన్ కో, సీ.జి.ఎస్ లలో ఒక యూనిట్ విద్యుత్ సరాసరి రూ 5 కే వస్తుంటే ఈ ప్రభుత్వ సంస్థలలో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా నిలిపివేసి కమిషన్ల కోసం ఒక యూనిట్ సరాసరి రూ 9 లకు బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేశారని అన్నారు. బహిరంగ కొనుగోళ్లకు రూ 12,200 కోట్లు ఖర్చు చేసి అందులో రూ 6 వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు. రూ 61 వేలు విలువ చేసే ట్రాన్స్ఫార్మర్ ను రూ 1.30 లక్షలకు పెంచి జగన్ రెడ్డి బినామీ సంస్థ అయిన శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వద్ద భారీ సంఖ్యలో కొనుగోలు చేశారని.. పులివెందులకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యజమాని విశ్వేశ్వర్ రెడ్డికి రూ 2629 కోట్లు ముట్ట జెప్పారని తెలిపారు. హిందూజా కంపెనీ నుండి హైదరాబాద్ కూకట్ పల్లిలో జగన్ రెడ్డి కుటుంబం బినామీ కంపెనీ 11.10 ఎకరాలు క్విడ్ ప్రో కింద కొట్టేసిందని, ఇందుకు బహుమానంగా రూ 1,234 కోట్లు డిస్కం ల నిధులు హిందూజా కు ధారా దత్తం చేస్తున్నారని అన్నారు. హిందూజా విద్యుత్ సరఫరా చేయనందున వారికి చెల్లించాల్సిన బాధ్యత లేదని విద్యుత్ సంస్థలు చెప్పినప్పటికీ జగన్ రెడ్డి క్యాబినెట్లో తీర్మానం చేయించి హిందుజాకు ధారాధత్తం చేశారని విమర్శించారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తెలంగాణతో పాటు దేశంలో 10 రాష్ట్రాలకు పైగా వ్యతిరేకిస్తున్నాయని., జగన్ రెడ్డి మాత్రం రైతుల మెడకు మీటర్ల ఉరి తాళ్లు బిగించారని అన్నారు. తన కేసుల మాఫీ కోసం అదాని సంస్థతో 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరాకు అధిక ధరతో ఒప్పందం కుదుర్చుకున్నారని, దీనివలన విద్యుత్ సంస్థలపై రూ 21 వేల కోట్ల భారం పడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం వలన కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగాయని తెలిపారు. అనంతరం పాత ధరలనే కొనసాగించాలని కోరుతూ విద్యుత్ శాఖ డీఈకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comentários