జగన్ రాజ్యాంగంలో రక్షణ కరువు - తన మాటలను వక్రీకరించారు - బత్యాల
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి జగన్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు పేర్కొన్నారు. గురువారం మన్నూరులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బత్యాల మాట్లాడుతూ పోలీసులపై తాను విమర్శలు చేసి కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ తనపై తప్పుడు ఆరోపణలు చేసి వీడియో ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రచారం చేయాల్సింది వివేకానంద రెడ్డి హత్య కేసులో గొడ్డలి వేటును గుండెపోటుగా చిత్రీకరించడం, బాధితులపైనే కేసులు బనాయించి బాధ్యులను చేయడం వంటి వాటిని ప్రచారం చేయాలని సజ్జల రామకృష్ణకు హితబోధ చేశారు. రాష్ట్రంలో పోలీసులు 95 శాతం నిజాయితీగా ఉన్నారని తెలిపారు. మిగిలిన వారు రాష్ట్ర ప్రభుత్వానికి గులాములుగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నేతలకు సహకరిస్తున్నారని అన్నారు. టిడిపి గుత్తితో గెలిచి వైసీపీతో కలిసి పనిచేస్తున్న వంశీ గన్నవరం లోని టిడిపి పార్టీ కార్యాలయం పై అనుచరులతో కలిసి దాడి చేసి కార్లు ధ్వంసం చేసి కార్యకర్తలను చితకబాదినా పోలీసులు అడ్డుకోలేకపోయారని, వారికే వత్తాసు పలుకుతూ సహకరించారని తెలిపారు. జగన్ ప్రభుత్వం లో అధోగతి పాలైన రాష్ట్ర స్థితిగతులను మార్చడానికి ప్రజల కోసం ఈ వయసులో చంద్రబాబు నాయుడు పర్యటనలు చేస్తే సహించలేక అడుగడుగునా పోలీసు బలగాలతో అడ్డుపడుతున్నారని అన్నారు. లోకేష్ బాబు చేస్తున్న యువగళం పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి జగన్ రెడ్డికి దిక్కుతోచక ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేసులకు, రిమాండ్లకు భయపడేది లేదని.. రానున్నది టిడిపి ప్రభుత్వమేనని 24 శాతం వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు డాక్టర్ సుధాకర్, మండల అధ్యక్షులు సుబ్బ నరసయ్య నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, మైనారిటీ నాయకులు అబూబకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments