ఓట్లు మనవే - సీట్లు మనవే మేలుకో బిసి చర్చావేదిక
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఓట్లు మనవే - సీట్లు మనవే అనే నినాదంతో పార్టీలకు అతీతంగా మేలుకో బిసి ప్రజాతంత్ర రాజకీయ చర్చా వేదిక బుధవారం సాయంత్రం స్థానిక పద్మశాలి కళ్యాణ మండపం నందు నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, కార్యక్రమానికి ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని పలు పార్టీలకు చెందిన బీసీ నాయకులు విరివిగా పాల్గొన్నారు. బీసీ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్. సోమ లక్ష్మీ నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి, ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్, బిజెపి కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు, ది బీసీ ప్రజా చైతన్య సమాఖ్య అధ్యక్షులు బొర్రా రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా బీసీల ఓట్లే కీలకమని, కావున రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను బీసీలకే కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు బీసీలకు సీట్లు ఎందుకు కేటాయించడం లేదో స్పష్టం చేయాలని, బీసీలు సీట్లు తీసుకోవటానికి ఎందుకు వెనుకాడుతున్నారు అంటూ ప్రశ్నించారు? అలాగే బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఓటర్లు బీసీలను ఎందుకు గెలిపించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బీసీలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తూ ఎంపీ ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని ప్రశానంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాతీయ బీసీ నాయకులు పాణ్యం సుబ్బరాయుడు, బీసీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి బివి రమణ రాజు, బీసీ సమాఖ్య కు చెందిన వెంకట కృష్ణ యాదవ్, పల్లెపు శ్రీనివాసులు, గాండ్ల రామకృష్ణ, పలువురు బీసీ నాయకులు, బీసీ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
Commentaires