కడపలో భాష్యం స్కూల్ వింత పోకడ
ఫీజు కడితేనే పుస్తకాలిస్తాం..బడికి రానిస్తాం..!
అమ్మఒడితో మాకు సంబంధం లేదు.. ఫీజు కట్టాల్సిందే.
ఫీజు కట్టిన తరువాతే పిల్లలను బడికి పంపండి.. అంతవరకూ నో ఎంట్రీ.
పాఠశాలల పున:ప్రారంభం పై పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ.
ప్రైవేటుకు వత్తాసు పలుకుతున్న వైనం.. అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు.
కడప ఐటీఐ సర్కిల్ లోని భాష్యం (గుంటూరుకు చెందిన) అనే ఓ ప్రైవేటు పాఠశాల వింత పోకడలకు పోతోంది. ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునుపే.. ఫీజు కట్టాలంటూ పాఠశాల యాజమాన్యం విద్యార్థులు తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తోంది. ఫీజు కడితేనే పుస్తకాలు ఇస్తామని లేకపోతే పిల్లలను తరగతి గదుల్లోకి కూడా అనుమతించేది లేదంటూ నర్మగర్భంగా సమాధానం ఇస్తోంది. ఫీజు కట్టిన తరువాతే పిల్లలను బడికి పంపాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ఫీజు కట్టేంత వరకూ పిల్లలను బడిలోకి అనుమతించేది లేదని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. అమ్మఒడి పథకంతో తమకు సంబంధం లేదని, ఫీజు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందేనంటూ భయపెడుతున్నారు. తమ వ్యాపారం కోసం పాఠశాల యాజమాన్యం అందించే పుస్తకాలు కొనుగోలు చేయాలన్నా వీలుకాదంటున్నారు. దేనికైనా ముందు ఫీజు చెల్లించాల్సిందే అంటున్నారు. ఫీజు చెల్లిస్తేనే మిగతావన్నీనంటూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. అదేమంటే పై నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయని, ఫీజు కట్టనిదే ఎవరినీ తరగతి గదుల్లోకి అనుమతించొద్దని ఆదేశాలు అందినట్టు చెబుతున్నారు. పాఠశాలలో ఏళ్ల తరబడి అక్కడే చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఫీజు కట్టనిదే ఎంట్రీ లేదని కుండ బద్దలుకొట్టి మరీ చెబుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఈ పాఠశాలను ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నా.. విద్యాశాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతోనే పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. నూతన విద్యా సంవత్సరంలో ఇంకా తరగతులు ప్రారంభం కాకుండానే.. ఫీజులు కడితే తప్ప విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించేది లేదని తెగించి చెబుతున్నారంటే.. విద్యాశాఖ అధికారుల నుంచి వారికి ఎంత మద్దతు లేనిదే వారు అంతగా బరితెగిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భాష్యం స్కూల్ వ్యవహారం చూస్తుంటే.. పాఠశాలల పున:ప్రారంభంలో జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో వసతులు ఎలా ఉన్నాయి? తరగతులు నిర్వహణ ఎలా ఉంటోంది? టీచింగ్ సిబ్బంది ఎంత మంది ఉన్నారు? విద్యార్థులకు సరిపోయే టీచింగ్ వ్యవస్థ, ఇతర సదుపాయాలు ఆయా పాఠశాలల్లో ఉన్నాయా? లేదా? అన్న విషయాలను విద్యాశాఖ అస్సలు పట్టించుకోవడం లేదనే విషయం తేటతెల్లమవుతోంది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ తక్షణమే స్పందించి ఐటీఐ సర్కిల్ లోని భాష్యం (గుంటూరుకు చెందిన) పాఠశాల నిబంధనలకు అనుగుణంగా నడుస్తోతోందా..? అలాగే ఈ పాఠశాల మాదిరే వ్యవహరిస్తున్న ఇతర ప్రైవేటు పాఠశాలలు కూడా విద్యాశాఖ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అన్నది విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
コメント