పెంచిన విద్యుత్ ఛార్జీలతో ఫ్యాను గాలి తిరోగమనం - బిజెపి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల నేపథ్యంలో ఫ్యాన్ గాలి తిరోగమన దిశగా పయనిస్తోందని, గడచిన నాలుగున్నర సంవత్సరాల వైసిపి పాలనలో 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని ప్రొద్దుటూరు బిజెపి కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకత్వం పెంచిన విద్యుత్, అదనపు చార్జీలు తగ్గించాలని నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో, శుక్రవారం ఉదయం చౌడేశ్వరి నగర్ లోని బిజెపి కార్యాలయం వద్ద నుండి గాంధీ రోడ్డు మీదుగా పెద్ద ఎత్తున బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి నిరసన తెలుపుతూ పవర్ హౌస్ రోడ్డు లోని విద్యుత్ శాఖ కార్యాలయానికి చేరుకొని పెంచిన విద్యుత్, అదనపు చార్జీలను వెంటనే తగ్గించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దిగిందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ, గడచిన నాలుగున్నర సంవత్సరాల వైసిపి పాలనలో పలు దఫాలుగా విద్యుత్ చార్జీలను పెంచి ఆ భారాన్ని ప్రజలపై మోపి ఆర్థిక భారాన్ని కలిగిస్తూ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. అనంతరం నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు విద్యుత్ చార్జీల రూపంలో అటు గృహ ఇటు వాణిజ్య విద్యుత్ వినియోగదారులకు అదనపు భారం మోపి ప్రజల నడ్డి విరిచారని, వివిధ రకాల చార్జీలు, సెస్, సర్వీస్ చార్జీల రూపంలో ప్రజలపై మరింత భారాన్ని మోపటమే కాకుండా, విద్యుత్ కొనుగోలు విషయంలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షులు వంగలి శశిభూషణ్ రెడ్ది, నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్ది, రాష్ట్ర మహిళా మోర్చా ట్రెజరర్ సీవీ జయలక్ష్మి, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు జాబివుల్లా, జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఉట్టి శ్రీనివాసులు, స్థానిక కో కన్వీనర్ పర్లపాడు గౌరీశంకర్, పట్టణ అధ్యక్షులు నరేంద్ర రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Commentaires