మోసపూరిత ప్రభుత్వానికి చరమగీతం
గిట్టుబాటు ధర లేక రైతు విలవిల
ధరల స్థిరీకరణ నిధి ఊసే లేదు
ఉపాధి లేక యువత బలవన్మరణాలు
అణగారిన వర్గాలను అణగదుకుతున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ప్రజా చార్జి సీట్
ధ్వజమెత్తిన రాష్ట్ర పొలిటికల్ ఫీడ్ బ్యాక్ కమిటీ సభ్యులు సాయి లోకేష్
రాజంపేట
2019 ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్య పెట్టేందుకు వైఎస్ఆర్సిపి విడుదల చేసిన మ్యానిఫెస్టోను అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్యాయాలకు, దోపిడీలకు పాల్పడుతూ రైతులను, యువతను మోసం చేసి పబ్బం గడుపుతోందని., ఇలాంటి మోసపూరిత ప్రభుత్వానికి చర్మ గీతం పలకాల్సిన సమయం ఆసన్నమైనదని బిజెపి రాష్ట్ర పొలిటికల్ ఫీడ్ బ్యాక్ కమిటీ సభ్యులు, రాజంపేట పార్లమెంటు అభ్యర్థి సాయి లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. వైకాపా అసంపూర్తి వాగ్దానాలను నిరసిస్తూ బుధవారం స్థానిక రోడ్డు మరియు భవనాల శాఖ కార్యాలయం వద్ద సాయి లోకేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ నిరసన కార్యక్రమంలో సాయి లోకేష్ మాట్లాడుతూ జగన్ రెడ్డి రైతులకు ప్రతి ఏటా రైతు భరోసా కింద రూ 12,500 లు పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చి నేడు కేంద్ర ప్రభుత్వం అందించే రూ 6 వేలుతో కలిపి రూ 12,500 మాత్రమే అందజేస్తూ రైతులను మోసగిస్తోందని అన్నారు. టమోటా, మామిడి, బొప్పాయి గంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని, వారికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని మాటలు చెప్పి నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్త లేదని విమర్శించారు. ప్రత్యేకించి రాజంపేట నియోజకవర్గంలో అరటి రైతుల ఆవేదన వర్ణనాతీతమని తెలిపారు. అకాల వర్షాలతో ఇటీవల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి అది కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రైతు పండించిన పంటకు టోల్ పన్ను రద్దు చేసినప్పటికీ పుల్లంపేట మండలంలోని ఉత్తమ వారి పల్లె వద్దగల అగ్రికల్చర్ టోల్గేట్ లో రైతుల నుంచి రూ 1500 లు వసూలు చేయడం దారుణమని అన్నారు. పి ఎం కె ఎస్ వై పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు రూ 400 కోట్లు సహాయం అందజేస్తోందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వినియోగించుకొని రైతులకు డ్రిప్పులు అందించకుండా మోసం చేస్తోందని అన్నారు.
రాజంపేట సర్వజనాసుపత్రిలో 50 నుంచి 100 పడకలకు నవీకరించి అభివృద్ధి చేస్తామని కేంద్రం నుంచి నిధులు పొంది నేటికీ నాలుగు సంవత్సరాలు గడచినా ఆసుపత్రి అభివృద్ధి మాట అటుంచి కనీసం రోగులకు మౌలిక వసతులు కల్పించడంలో కూడా పూర్తిగా విఫలమైందని అన్నారు. వైద్యుల కొరత, మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నాయని తెలిపారు. బీసీ సంక్షేమానికి రూ 75 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి వారిని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చి బీసీలను పూర్తిగా విస్మరించిందని., ఎస్సీ సబ్ ప్లాన్ ను పూర్తిగా నీరుగార్చిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అణగారిన వర్గాలు రోజురోజుకు అట్టడుగు స్థాయికి పోతున్నారని తెలిపారు.
అన్నమయ్య డ్యాం తెగి 37 మంది జల సమాధి అయ్యారని, డ్యాం పరివాహక ప్రాంతాలలోని గ్రామాల ప్రజలు ఆస్తి, పాడి, పంటతో పాటు సర్వస్వం కోల్పోయారని., ఈ విపత్తు సంభవించి నేటికి 18 నెలలు కావస్తున్నా వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. పి ఎం ఏ వై పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలను నిర్మించకుండా జాప్యం చేస్తూ సర్వం కోల్పోయిన నిర్వాసితులను మరింత వేదనకు గురి చేస్తున్న దౌద్భాగ్యపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారికి ఎదురెల్లి తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి నిస్వార్ధంగా సేవలందించిన పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తానని వాగ్దానం చేసి రాష్ట్ర ప్రభుత్వం వారిని పూర్తిగా విస్మరించిందని తెలియజేశారు
2016లో రాజంపేటకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 19 కోట్ల రూపాయల నిధులు కేటాయించినా నేటికీ తాత్కాలిక భవనంలోనే తరగతులు నిర్వహిస్తూ పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న మద్యంపై వచ్చే ఆదాయమే పరమావధిగా భావించి మద్యం విక్రయాలను రెట్టింపు చేసుకుంటూ పేదలను పీడించడమే లక్ష్యంగా చేసుకున్నదని అన్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో మద్యంపై రూ 17,300 కోట్లు ఆదాయం రాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో అది రూ 30,600 కోట్లుకు చేరిందని తెలిపారు.
పక్క రాష్ట్రాల కంటే పెట్రోలు, డీజిల్ పై లీటరుకు రూ 13 అదనంగా వసూలు చేస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని అన్నారు. కొత్త జిల్లా ఏర్పాటుచేసి, దీనికి అన్నమయ్య జిల్లా గా నామకరణం చేసి పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల స్వగ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే జయంత్యోత్సవాలకు కూడా మంగళం పలికారని, అన్నమాచార్యుల ధ్యాన మందిరం కూడా శిథిలావస్థకు చేరుకున్నదని అన్నారు.
మద్యంపై ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో, కోట్లు విలువ చేసే ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి ఎలా సొమ్ము చేసుకోవాలో అనే అంశాల పట్ల తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి పైన, చేసిన వాగ్దానాల పైన చిత్తశుద్ధి లేదని., వైసీపీ ప్రభుత్వంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని విమర్శించారు. వైసిపి ఆగడాలకు రానున్న ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతరం బిజెపి శ్రేణులతో కలిసి అర్బన్ సీఐ నరసింహారావుకు రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలపై ప్రజా చార్జి సీటును అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments