కృష్ణా జిల్లా, గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసినో వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడ చేరుకుంది, దీంతో గుడివాడ టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసేందుకు వైసీపీ నేతలు వచ్చారు. అక్కడున్న టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. బోండా ఉమ కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పైగా కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లేందుకు అనుమతిలేదంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
మరోవైపు టీడీపీ, వైసీపీ ర్యాలీలు ఒకే ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులను తోసుకుంటూ వైసీపీ శ్రేణులు నాగవరప్పాడు సెంటర్ నుంచి నెహ్రూ చౌక్ సెంటర్ చేరుకున్నారు. రెండు ర్యాలీలు ఎదురుపడితే తీవ్ర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు నెహ్రూ చౌక్ సెంటర్ సమీపంలో టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. అలాగే ఎన్టీఆర్ స్టేడియం దారిలో వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
Comments