చెరువులో పడి బాలుడు మృతి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాల నుంచి స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డ ఘటన రాజంపేట పట్టణంలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
బోయినపల్లి లోని ఎల్లాగడ్డ లో నివాసం ఉంటున్న వెంకటేష్ కుమారుడు చరణ్ తేజ్ (11) బోయినపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం వరకు పాఠశాలలోనే ఉన్న విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు దగ్గరలో గల మన్నూరు చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ చరణ్ తెజ్ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న బాలుడిని తన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులు ఎల్లారెడ్డి బాలుడిని బ్రతికించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే సమయం మించి పోవడంతో బాలుడు మృత్యువాత పడ్డాడు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృత్యువాత పడ్డాడని బాలుడి తండ్రి వెంకటేష్ ఆరోపిస్తున్నారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తరచూ మధ్యాహ్నం సమయంలో పాఠశాల నుంచి ఈతకు వెళుతున్నా ఉపాధ్యాయులు పట్టించుకోలేదని., విద్యార్థులు పాఠశాలలో ఉన్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని, ఈ దుర్ఘటన కేవలం ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆర్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ ఆరోపించారు.
Comments