మందుబాబులకు పిల్లను ఇవ్వకండి: కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్
మద్యానికి అలవాటు పడి తన కుమారుడు మరణించారన్న కౌశల్ కిశోర్
ఇప్పుడు అతని భార్య ఏకాకిగా మిగిలిపోయిందని వ్యాఖ్య.
ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని ఆవేదన
మందుకు బానిసైన వ్యక్తికి పిల్లను ఇవ్వొద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ అన్నారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఒక కూలీ లేదా రిక్షా కార్మికుడిని పెళ్లికొడుకుగా ఎంపిక చేయడం మంచిదని చెప్పారు. తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటైన తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని డీ అడిక్షన్ కేంద్రంలో కూడా చేర్పించామని... ఆ అలవాటును మానేస్తాడనే అనుకున్నామని... ఆ తర్వాత ఆరు నెలలకు పెళ్లి చేసుకున్నాడని చెప్పారు.
కానీ, మళ్లీ తాగడాన్ని ప్రారంభించాడని, చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని తెలిపారు. అతను చనిపోయేటప్పుడు అతని కుమారుడికి రెండేళ్ల వయసు మాత్రమేనని చెప్పారు. అతని భార్య ఏకాకిగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదని చెప్పారు. ఇలాంటి పరిస్థితి నుంచి మీ కూతుర్లని, అక్కచెల్లెళ్లను కాపాడుకోవాలని తెలిపారు.
Comments