జూన్ 4 రాత్రి 8-9 గంటలకల్లా తుది ఫలితాలు: సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న సీఈఓ ముకేశ్ కుమార్ మీనా
పోలీంగ్ రోజున 144 సెక్షన్ విధింపు
మధ్యహ్నాం 2 గంటలకల్లా సగానికిపైగా నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి
ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు పూర్తవుతుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఒట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ సమస్యాత్మక జిల్లాల్లోని లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేసి, సీనియర్ పోలీసు అధికారులను నియమిస్తామని అన్నారు. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ప్రత్యేకదృష్టి పెడతామని తెలిపారు. పల్నాడు జిల్లాలో రాష్ట్ర డీజీపీతో కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ఇక 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల కౌంటింగ్ నిర్వహిస్తారు. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25 పైగా రౌండ్లు ఉంటాయి.
Comentários