చెన్నకేశవా... కథ అడ్డం తిరిగింది
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
స్థానిక పాత మార్కెట్ నందు వెలసిన శ్రీ మహాలక్ష్మి సామెత చిన్న కేశవ స్వామి దేవస్థానం దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయం వెలుపల ధర్నాకు దిగటం అందరిని ఆశ్చర్యపరచింది, గత రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా తాము ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలపటం ఇక్కడి కొసమెరుపు.
వివరాల్లోకి వెళితే నిన్నటి రోజున ఆలయ అర్చకుల తొలగింపు, బాధిత అర్చకులను పరామర్శించిన స్థానిక టీడీపీ నాయకులు, పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం పాఠకులకు విదితమే. కాగా నేడు దేవస్థాన దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయం వెలుపల తమ నిరసన తెలియచేసారు, ఈ సందర్భంగా దేవస్థాన దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ మూలే రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ అర్చకులు తమ విధి విధానాలు మార్చుకోవాలని, భక్తులతో సఖ్యతగా మెలుగుతూ పూజా కైంకర్యాలు చేపట్టవలసి ఉండగా అందుకు విరుద్ధంగా ఇక్కడి అర్చకులు ప్రవర్తిస్తున్నారని, అర్చకులపై పలు దపాలు పలు ఆరోపణల నేపథ్యంలో, తాము కూడా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించామని, అయిననూ ఎటువంటి మార్పు లేకపోవటం చేత తాము పుష్పగిరి నుండి నలబై సంవత్సరాల అనుభవం కలిగిన మరో అర్చకుడిని నియమించామని, ఇది ఓర్వలేని అర్చకులు నిన్నటి రోజున ఆలయంలో అలజడి సృష్టించారని తెలిపారు. స్థానిక వైసీపీ నాయకులు రంగప్రవేశం చేశారు అనటం అవాస్తవమని, పెద్ద మనిషిగా వచ్చిన వ్యక్తి బంధువు దేవస్థాన దసరా ఉత్సవ కమిటీలో ఉండటం చేత ఆయన సామరస్యంగా పలు సూచనలు సలహాలు మాత్రమే ఇచ్చారని, దేవస్థానానికి రాజకీయ రంగు పులమటం సమంజసం కాదని హితువు పలికారు.
అనంతరం దేవస్థాన దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయం వెలుపల బైఠాయించి ఈఓ, అర్చకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments