కోట్లాది రూపాయల మధ్య యదేచ్ఛగా కొనసాగుతున్న చికెన్ వ్యర్థాల వ్యాపారం - రవాణాలో కనీసపు భద్రతలు పాటించని వైనం - చేపలకు ఆహారంగా విరివిగా వాడకం - ప్రజారోగ్యానికి ముప్పు తప్పదంటున్న జనం - మాకేమీ తెలియదుగా... అన్నట్టు అధికారగణం.
మాంసాహారులు జలపుష్పాలు గా పిలవబడే చేపలను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కొవ్వు శాతం తక్కువ తో అత్యంత పోషక విలువలతో అనేక పేర్లతో అతి తక్కువ ధరతో... ఉన్న వారి నుంచి పేద వారి వరకు అమితంగా ఇష్టపడే తినే ఆహారం చేప. ఈజీగా జీర్ణం తో పాటు త్వరితగతిన శక్తిని ఇవ్వడంలో చేప కు మరొకటి సాటిరావు.
కానీ ఎవడు నేర్పించాడో కానీ కొన్నిరోజుల పాటు నిల్వ ఉండి కుళ్ళిన చికెన్ వ్యర్థాలను కొందరు సేకరించి చేపలు పెంచే యజమానులకు అతి తక్కువ ధరలకు అందిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ అనేక రోగాలకు కారణమవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రవాణా మార్గంలో ఎన్ని చెక్ పోస్ట్ లు ఉన్ననూ కానీ వారి పనికి ఎలాంటి ఆటంకం లేదు. తరలింపు దారులకు, అధికారులకు మధ్య సంబంధాలు అంత దృఢంగా ఉన్నాయా?? అన్న అనుమానం సామాన్య జనులకు సైతం కలగకమానదు.
ఇదంతా ఒక ఎత్తయితే నెల్లూరు జిల్లాలోని అనేక గ్రామాలు చేపలకు, రొయ్యలకు పెట్టింది పేరు. ఇదే వ్యాపారంగా మలచుకునే కొందరు వ్యక్తులు చికెన్ వ్యర్థాల కోసం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సుమారు ప్రతిరోజు నాలుగు టెంపో వాహనాలు కనీసపు జాగ్రత్తలు తీసుకోకుండా దుర్గంధపు వాసనను అందరికీ విరజిల్లుతూ తమ ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుతూ ఉన్నారంటే మరి అధికారులు పాత్ర ఏమయింది అన్న అనుమానం అందరికీ కలుగుతుంది.
స్థానిక చికెన్ వ్యాపారస్తులు సైతం తమకు నచ్చిన రీతిలో సాయంత్రం అయ్యే సరికి ఏదో ఒక రోడ్డుకు పరిగెత్తి వాటిని కుమ్మరించి మాకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే ఆ దారుల వెంబడి వెళ్లే వాహనదారులు ఆ పరిసరాలకు దగ్గరగా నివసించే ప్రజలు వాటి నుంచి వచ్చే వాసనలతో ముక్కు మూసుకు పోవడం తప్ప మేము చేసేదేముంది!! అన్నట్లు వారి గోడును వెళ్లబోస్తున్నారు.
చికెన్ వ్యర్థాలను చేపలకు రొయ్యలకు ఆహారంగా ఉపయోగించకూడదని నిబంధన ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి లాభార్జనే ధ్యేయం గా చేపలకు, రొయ్యలకు వాడాల్సిన పదార్థాలను వాడితే ఎక్కువ ఖర్చు తక్కువ ఆదాయం అన్న దురుద్దేశంతో చేపల వ్యాపారస్తులు చికెన్ వ్యర్థాల వ్యాపారస్తులను ప్రోత్సహించడం వాటన్నింటిని నిలుపుదలచేయాల్సిన అధికారులు గమనించక మాకేమీ తెలియదులే అన్నట్లు వ్యవహరించడం ఇదంతా చూస్తుంటే ఎవరికి అందాల్సిన ముడుపులు వారికి అందుతున్నాయి కదా!! అందుకేనేమో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఊరకుంటున్నారు గా..పోయేది ప్రజా ఆరోగ్యమే కదా మనది కాదు గా అని ప్రజల నుంచి విమర్శలు ఘాటుగా వస్తున్నాయి.
ఏది ఏమైనా ఇకనైనా అధికారులు చికెన్ వ్యర్థాల వ్యాపారస్తులు వాహనాల ను పూర్తిగా నిరోధించి, తరలింపులో తీసుకుంటున్న భద్రతా చర్యలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సామాన్య జనులు గగ్గోలు పెడుతున్నారు. కాగా చికెన్ వ్యాపారస్తులు కూడా వ్యర్ధాలను పారవేయడంలో జన ఆవాసాలకు దూరంగా ఉండేటట్లు చూడటమా? లేక అందరూ కలిసి వ్యర్థాలను బూడిద చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవడమా అన్న ఆలోచనలు చేస్తే తప్ప.. ప్రజలకు చికెన్ తినడం తో ఆరోగ్యం కలుగుతుందో లేదో తెలియదు కానీ వ్యర్థాల వాసనతోనూ వ్యర్థాలను ఉపయోగించిన చేపలను తినడం తోనూ నూటికి నూరుపాళ్లు అనారోగ్యాలు పొంచి ఉన్నాయనడం లో సందేహం లేదు. అధికారులు ఎలాంటి చర్యలు గై కొంటారో మనందరం వేచి చూడాలి.
Comments