బి.జె.పి. ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకుందాం..
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం..
సీపీఐ-ఏఐటీయూసీ నిరసన దీక్షకు టిడిపి, సిపిఎం మద్దతు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ , తెలుగు ప్రజల భావోద్వేగాలతో, బలిదానాలతో, పోరాటాలతో నిర్మితమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కోరారు. జనవరి 27వ తేదీన విశాఖ లో జరిగే కార్మిక మహాగర్జనను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సీపీఐ -ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 మంది ప్రజల బలిదానాలతో, 26 వేలమంది రైతుల త్యాగాలతో, 67 మంది శాసనసభ్యులు, 7 గురు పార్లమెంటు సభ్యుల రాజీనామాలతో 'ఆంధ్రుల హక్కు- విశాఖ ఉక్కు' సాధించబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేకపోయినా, సొంత గనులు కేటాయించకపోయినా నిర్విఘ్నంగా నడుస్తున్నదన్నారు. నేడు 35 వేలమంది పర్మినెంటు, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యక్షముగా, లక్షమందికి పరోక్షంగా ఉపాధి చూపిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 50 వేల కోట్లు పన్నులు, ఇతర డివిడెండ్ల రూపంలో సమకూర్చిందని తెలిపారు. కేవలం 5 వేల కోట్ల కేంద్ర మూలధనంతో ఇంత స్థాయికి ఎదిగిన పరిశ్రమను, రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న ఫ్యాక్టరీని ప్రత్యేకించి విశాఖను అభివృద్ధిపథంలో నిలిపిన సంస్థను కేంద్ర బి.జె.పి. సర్కార్ ప్రైవేటీకరిస్తానని తెగేసి చెపుతున్నదని.. 2021 జనవరి 27న ప్రైవేటీకరణకు పావులు కదుపుతూ ప్రకటన చేసిందన్నారు.
రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ, తెలుగు ప్రజల భావోద్వేగాలతో, బలిదానాలతో నిర్మితమై ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మన్నికైన, నాణ్యమైన ఫ్యాక్టరీని ప్రభుత్వరంగంలోనే నిలబెట్టుకోవటానికి రెండు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ కార్మికులు, నిర్వాసితులు, రాష్ట్రంలోని అన్ని తరగతులు, విభాగాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నా సిగ్గు, ఎగ్గులేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయాన్ని తలపెట్టి ప్రజల ఆందోళనలను, నిరసనలను పెడచెవిన పెడుతున్నదన్నారు. ఈ దుర్మార్గమైన ఏకపక్ష నియంతృత్వ పోకడకు, కార్పొరేటు కంపెనీలైన పోస్కో, ఆదాని, అంబానీలకు లాభాలు చేకూర్చటానికి ప్రజల ఆస్తులను తెగనమ్మే చర్యకు చరమగీతం పాడటానికి 2023 జనవరి 27న విశాఖలో లక్షమందితో "కార్మిక మహాగర్జనలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.రవికుమార్ తెలుగుదేశం పార్టీ మండల నాయకులు రమణ, అబూబకర్ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మెస్ రాయుడు, గంగాధర్, గాలి చంద్ర , మురళి సరోజనమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి ఈ.సికిందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోపు కిష్టప్ప, పండుగోల మని, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కాటంశెట్టి వెంకటయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు రాహుల్, జిల్లా ఉపాధ్యక్షులు మలిశెట్టి జతిన్, నాయకులు మలిశెట్టి వెంకటయ్య, డి.హెచ్.పి.ఎస్ నాయకులు శివయ్య, సిపిఐ మండల కార్యదర్శులు నాగమ్మ, ఆదినారాయణ, సెల్వకుమార్, నాయకులు మహమ్మద్, హరి, నాగేశ్వరరావు, చంద్ర, బ్రహ్మయ్య, కేశం ప్రసాద్, గంగయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు సింగనమల మణి, సుబ్బరాయుడు, చలపతి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : దీక్ష చేస్తున్న సిపిఐ నాయకులు
Comments