వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు
కొత్తపల్లే పంచాయతీలో పారిశుధ్య కార్మికుల తొలగింపుపై నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, నేడు పంచాయతీ పరిధిలోని పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగిన వైనం పంచాయతీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు కొన్ని తీవ్ర విమర్శలు చేశారు. తమని సొంత పనులకు వినియోగించుకుంటూ, కొందరు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఇళ్లలో పనిచేయాలని హుకుం జారీ చేస్తున్నారని, అందుకు తాము అంగీకరించక వ్యతిరేకించిన కారణంగానే, తమను వీధుల నుండి తొలగించే ప్రతిపాదనను సర్పంచ్ కొనిరెడ్డి ముందు ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల తొలగింపు ప్రక్రియను పూర్తిగా అసంబధ్ధమని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా ఉన్న విభేదాల కారణంగా కార్మికుల పొట్ట కొట్టటం సబబు కాదని, వెంటనే పంచాయతీ కార్యదర్శి తొలగించిన పారిశుధ్య కార్మికులను విధులలోకి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీలలోని పారిశుధ్య కార్మికుల చేత చలో ప్రొద్దుటూరుకు పిలుపునిచ్చి, ప్రొద్దుటూరును దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
Comments