కడప లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం కడప, అన్నమయ్య జిల్లాల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఐటియు కడప జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ రామమోహన్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కడప జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. విజయభాస్కర్ డిమాండ్ చేశారు.
శుక్రవారం నాడు కడప నగరంలో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉన్న అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, మున్సిపల్ తదితర రంగాల కార్మికులు సమస్యల పరిష్కారానికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
ఉమ్మడి జిల్లాలో వున్న రాయచోటి, రాజంపేట, మైదుకూరు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ పెండింగ్లో ఉందని ఆయన అన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జమ్మలమడుగులో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు గత పెండింగ్లో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ శానిటేషన్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ అలవెన్స్ కింద నెలకు 6000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన అన్నారు. కానీ ఆ మొత్తం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
పండుగలు వచ్చినప్పుడు జీతాలు రాకపోవడం కారణంగా కార్మికుల కుటుంబాలు అప్పుల పాలు అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. మళ్లీ మే డే వస్తోందని కార్మిక దినోత్సవం రోజుకైనా కార్మికులు అందరికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల పెండింగులో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్మికులను ఆదుకొనేలా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన చెప్పులు, నూనె, సబ్బులు, బట్టలు తదితర వాటన్నిటిని సకాలంలో అందించడం కోసం అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలు, అలవెన్సులు ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Comentários