డీఎస్పీగా ఎంపిక అయిన శివప్రియరెడ్డిని సన్మానించిన గోపికృష్ణ స్కూల్ యాజమాన్యం
కడపజిల్లా, ప్రొద్దుటూరు
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పదానికి సిసలైన నిదర్శంగా నిలిచింది ఆ యువతి. మొదటి ప్రయత్నంలో విజయం అంచుల దాకా వెళ్లి వెనుదిరిగినప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా రేయింబవళ్లు శ్రమించింది. మరోవైపు భర్త, తల్లిదండ్రులు, అత్తామామల సహకారం ఆమెను విజయతీరాలకు చేర్చింది. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన అంకిరెడ్డిపల్లె రామశేఖర్రెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె శివప్రియారెడ్డి పదవ తరగతి వరకు ప్రొద్దుటూరులోని గోపికృష్ణ స్కూల్లో చదివింది.బీటెక్, తర్వాత వివాహ అనంతరం 2021 నుంచి సివిల్స్ ప్రిపేర్ అయింది. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ వన్ అధికారిగా ఉత్తీర్ణత సాధించింది.
ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా శివప్రియారెడ్డి పని చేస్తూ 2018లో గ్రూప్-1 పరీక్షకు హాజరైంది. తొలి ప్రయత్నంలో విజయం దక్కలేదు. 2021లో బద్వేలుకు చెందిన పెసల మణి కాంత్ రెడ్డి తో వివాహం జరిగింది. భర్త, అత్తమామలు మల్లేశ్వర్రెడ్డి సరస్వతిల ప్రోత్సాహంతో తిరిగి 2022లో గ్రూప్-1 పరీక్షకు హాజరై ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి సివిల్ డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు.
శివప్రియరెడ్డి మంగళవారం ఉదయం తాను విద్యను అభ్యసించిన గోపికృష్ణ స్కూల్ ను సందర్శించగా, స్కూల్ కరస్పాండెంట్ కె.కృష్ణప్రదీప్ రెడ్డి, సందీప్ రెడ్డి, ప్రిన్సిపాల్ గంగయ్య, టీచర్లు శివప్రియరెడ్డి దంపతులను, తండ్రి రామశేఖర్ రెడ్డిలను సత్కరించారు.
ఈ సందర్భంగా శివప్రియరెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండి మంచి క్రమశిక్షణతో శ్రద్ధగా చదువుకోవడం వల్ల జీవితంలో ఉన్నతస్థానాలను అధిరోహించవచ్చునని, అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గోపికృష్ణ స్కూల్ కు ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
コメント