జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలి - సిపిఐ, ఎఐఎస్ఎఫ్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
విద్యా, వైద్య, వ్యాపార, వాణిజ్యపరంగా కడప జిల్లాలో పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణం నందలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, స్టాప్ నర్సులు, ఫార్మసిస్టులు, టెక్నికల్ అసిస్టెంట్లను అలాగే తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంగళవారం ఉదయం భారతీయ కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బి రామయ్య అలాగే సిపిఐ టౌన్ సెక్రటరీ పోరుమామిళ్ల సుబ్బరాయుడు ల ఆధ్వర్యంలో సిపిఐ అనుబంధ సంస్థ ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు మండల తాసిల్దార్ విద్యాసాగర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో వినోద్ కుమార్ ఐఏఎస్ శీతల కన్ను మూలంగా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో 30 పడకలకు ఒక ఫార్మసిస్టు ఉండాల్సి ఉండగా కేవలం నలుగురు తోనే పని భారాన్ని పెంచారని, అలాగే ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ లకు జనరల్ డ్యూటీ అంటూ సంబంధం లేని విధులకు వినియోగిస్తు, అస్తవ్యస్తంగా అడ్మినిస్ట్రేషన్ విధానం తయారు చేశారని వారు అభిప్రాయపడ్డారు.
ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి దినం ప్రొద్దుటూరు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా వివిధ మండలాల నుండి సుమారు 1500 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారని, దాదాపు 70 మంది ఇన్ పేషెంట్లు వస్తుండే ఈ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా నెలకొందని, పర్యవసానంగా ఇక్కడి నుండి కడప రిమ్స్ కు రెఫర్ చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతోందని అన్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిని నాటి ప్రభుత్వం గొంతు నిలిపి చంపే ప్రయత్నం చేసి ఎటువంటి సౌకర్యాలు హోదా లేని పులివెందులకు మెడికల్ కళాశాలను మళ్ళించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పరిశీలన బృందం (ఎంసీఐ) కూడా పులివెందుల మెడికల్ కళాశాలకు అడ్మిషన్లను నిరాకరించిన విషయం ప్రభుత్వానికి ప్రజలకు తెలుసునని, కావున ఇకనైనా ప్రొద్దుటూరు ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల హాస్టల్స్ లోని విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించాలని వారు కోరారు.
Comments