అదానికి దేశాన్ని తాకట్టు పెడుతున్న బిజెపిని తరిమికొడదాం - సిపిఐ, సిపిఎం
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఆదానికి దేశాన్ని తాకట్టు పెడుతున్న బిజెపిని తరిమికొట్టాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలు రవికుమార్ లు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా సిపిఐ -సిపిఎం ప్రచార భేరి రెండవ రోజు కార్యక్రమం లో భాగంగా శనివారం హరిశ్చంద్ర నగర్ లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు దాసోహం అయిందని అన్నారు.
దేశాన్ని అదాని లాంటి వారికి తాకట్టు పెడుతున్నారని, ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రధాని వారికే అప్పజెప్పడానికి పూర్తిస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి మూలస్తంభాలుగా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం వంటి గొప్ప విలువలను ఈ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఆయా జాతులు, ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు ఫెడరలిజం రూపంలో రాజ్యాంగంలో విడదీయరాని భాగంగా ఉన్నాయన్నారు. వాటిని బిజెపి ప్రభుత్వం కాలరాసి ఒకే దేశం - ఒకే భాష, ఒకే విద్య - ఒకే పన్ను విధానాన్ని బలవంతంగా రుద్దుతోందని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా పన్నులు వేస్తూ బ్రిటిష్ పాలనను తలపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి రావలసినటువంటి హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడకుండా తన సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణదేవరా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు రమణ, సిపిఐ-సిపిఎం నాయకులు నరసింహులు, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Comments