అటకెక్కిన విభజన హామీలు - సిపిఐ
బిజెపి, వైసిపి రాయలసీమ ద్రోహులు - సిపిఐ
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం విభజన హామీలు మరిచి, రాష్ట్రానికి విభజన హామీల ద్వారా రావలసిన హక్కులను మరచి, అప్పుల కోసం, వ్యక్తిగతమైన అంశాల కోసం కేంద్రాన్ని గుడ్డిగా సమర్థిస్తున్నదని, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి, రాష్ట్రానికి ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలలోని కడప జిల్లాకు తీరని ద్రోహం చేస్తోందని సిపిఐ కడప జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య, సిపిఐ ఏరియా కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు సంయుక్తంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పట్ల కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతున్నాయని, రాయలసీమ కరువు ప్రాంతమని, ఇరిగేషన్ ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి చెందాలని నాటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయగా, నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కడప జిల్లా ప్రజల హక్కును కాలరాస్తు ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించటం లాభదాయకం కాదని వెల్లడించటం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. కేంద్రానికి వచ్చిన నివేదికలు బయటపెట్టి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం లాభదాయకమా కాదా అని ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రి పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానంగా ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రకటన చేస్తున్న నేపథ్యంలో అక్కడి వైసిపి ఎంపీలు అభ్యంతరాలు తెలుపకపోగా నోరు మెదపకపోవడం మౌనం పాటించటం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు అటకెక్కినా, కేంద్రం చేసే ప్రతి పనికి వైసీపీ ప్రభుత్వం మద్దతిస్తోందని, ఇకనైనా జిల్లా ప్రజలను మభ్యపెట్టడం సబబు కాదని, విభజన హామీ చట్టంలో పొందుపరచిన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, లేనియెడల సిపిఐ పార్టీ, వామపక్షాలు, ప్రజా సంఘాలతో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడు హరి పాల్గొన్నారు.
Comments