తీవ్రదుర్గంధంలో హరిజనవాడ ప్రజలు - సీపీఐ
రోగాల బారిన నుండి హరిజనవాడ ప్రజలను కాపాడాలి - సిపిఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బరాయుడు
ప్రొద్దుటూరు పట్టణంలోని 16వ వార్డు 18వ సచివాలయం హరిజనవాడ చెందిన ప్రజల నివాస గృహాలలోనికి మురుగు నీరు, వర్షపు నీరు వచ్చి తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ అందులోనే జీవనం సాగిస్తున్నారని సుబ్బరాయుడు అన్నారు. సిపిఐ బృందం నేడు ఈ ప్రాంతంలో పరిశీలన చేపట్టింది. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ కాలువ నిర్మాణం సరిగా చేపట్టలేదని ఈ మురుగు నీరు కొత్తపల్లి కాలువలోకి పోవడానికి 20 అడుగుల కాలువ నిర్మాణాన్ని చేపట్టకపోవడం మూలంగా మురుగునీరు తిరిగి వీరి ఇంటి ముందరే నిలుస్తున్నాయని, మరోవైపు కాలువల ఎత్తు పెంచి సిమెంటు రోడ్డు ఎత్తును పెంచకపోవడం వలన చిన్నపాటి వర్షానికి మొత్తం నీళ్లన్నీ ఇళ్లల్లోకి వస్తున్నా యన్నారు. గత ప్రభుత్వంలో ఈ 18వ వార్డు సచివాలయ పరిధి అభివృద్ధికై 20 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని, అయితే ఆ సొమ్ము అస్తవ్యస్త పరిసరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అభివృద్ధి కొరకు ఉపయోగించకుండా, కుల వివక్షతతో మరో ప్రాంతానికి మళ్ళించారని పర్యవసానంగా ఈ వర్షాలకు పక్కనే ఉన్న స్మశానంలో నీళ్లు అన్ని వీరి ఇళ్లల్లోకి రావడంతో పాములు, పురుగులతో జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ మురికి నీళ్ల మూలంగా ప్రజలు అంటు రోగాల బారిన పడుతున్నారని, ప్రతి ఇంట జ్వర పీడితులు ఉన్నారని వారు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఈ మురికి నీళ్లలోనే ఉండడంతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని ఇంత వరకు స్థానిక కౌన్సిలర్, అధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్లాబ్ వరకు పరిమితమై పూర్తి నిర్మాణం లేకపోవడంతో రెండేళ్లుగా నిరుపయోగంగా మారిందని మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవచేసి హరిజనవాడ ప్రజల పట్ల బాధ్యతతో విధులు నిర్వహించాలని లేనిపక్షంలో సిపిఐ గా ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ పరిశీలన బృందంలో సిపిఐ ఏరియా నాయకులు మచ్చ శ్రీను, అనిమెల దస్తగిరి, ఏఐవైఎఫ్ సూర్య తదితరులు పాల్గొన్నారు.
Comentarios