ఏప్రిల్ 6 నుండి 10 వరకు కేరళలో సీపీఎం మహాసభలు - కరపత్రాలు విడుదల చేసిన సీపీఎం నేతలు రామమోహన్, సిహెచ్. చంద్రశేఖర్.
సీపీఎం పార్టీ అఖిల భారత 23 వ మహాసభలు ఏప్రిల్ 6 నుండి 10 వరకు కేరళ రాష్ట్రంలోని కన్నూర్ లో జరుగుతున్నాయని సీపీఎం కడప జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామమోహన్, జిల్లా నాయకులు సి హెచ్. చంద్రశేఖర్ తెలియజేసారు. బుధవారం నాడు ఉదయం రైల్వేకోడూరులో ఉన్న సీపీఎం ఆఫీసులో 23 వ సీపీఎం పార్టీ మహాసభల కరపత్రాలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో జాతీయ స్థాయిలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుగుతాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో చేయాల్సిన పోరాటాలపై చర్చ జరుగుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరంతరం పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర భారాలు మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
2014లో తక్కువ ధర ఉన్న గ్యాస్ 2022లో 1050 రూపాయలు చేరిందని వారన్నారు. ఒక వైపు భారాలు మోపుతూ మరోవైపు ప్రజల మధ్య మతం పేరుతో ప్రజల మధ్య చీలికలు తెచ్చేలా వ్యవహరిస్తోందన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని అమ్మివేసి ప్రైవేటు వ్యక్తులకు , సంస్థలకు కట్టబెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు.
మన రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేట్ పరం చేస్తున్నదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజాసమస్యలపై పని చేసే సీపీఎం 23 వ అఖిల భారత మహాసభల విజయవంతం చేయడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చెన్నయ్య, యానాదయ్య, జాన్ ప్రసాద్, మౌలాలి బాషా పాల్గొన్నారు.
Comments