వరద హయాంలో అభివృద్ధి ఇదిగో - యువ నాయకుడు కొండారెడ్డి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గత కొద్ది రోజుల క్రితం ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మౌలిక వసతులు కల్పించలేదని వ్యాఖ్యానించడం పట్ల టిడిపి యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తనదైన శైలిలో స్పందించారు.
తాము చేసిన అభివృద్ధి గురించి ముందు మాట్లాడతానని, తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వైసిపి నేతల మాట్లాడవచ్చని అంటూ, 1994 లో జరిగిన ఎన్నికలలో ప్రజలను ఓటు అడగటానికి తాము చేసిన అభివృద్దే మంత్రంలా పనిచేసిందని, అంతకుమునుపు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి తారు రోడ్లు వేయించామని, పలు ప్రధాన రోడ్లను వెడల్పు చేయించి విద్యుత్ దీపాలతో అలంకరించినట్లు తెలిపారు. నాడు తన తండ్రి వరదరాజుల రెడ్డి హయాంలో వచ్చిన సబ్ స్టేషన్లు మినహా ప్రస్తుతం ఏ ఒక్క సబ్ స్టేషన్ వచ్చినట్లు వైసిపి నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు?
నూతన రోడ్ల నిర్మాణం, కుందు నదిపై పలుచోట్ల 5 బ్రిడ్జిలు, చాపాడు హై లెవెల్ బ్రిడ్జ, కోర్టు బిల్డింగ్, వెటర్నరీ కాలేజ్, 350 పడకుల ప్రభుత్వ ఆసుపత్రి, 150 ఎకరాలలో అమృత నగర్ లాంటి టౌన్షిప్ ల నిర్మాణం, ఏకో పార్క్, ఆర్టీవో కార్యాలయం, 50 ఎకరాలలో అప్పేరల్ పార్క్, అధికారులతో మాట్లాడి కె సి కెనాల్ మైలవరం కాలువల ఆధునీకరణ, వాటర్ ట్యాంకులు, మున్సిపల్ కమర్షియల్ కాంప్లెక్స్ ల నిర్మాణం లాంటివి చేపట్టి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే పనులు చేశామే తప్ప, ఏనాడూ కాంట్రాక్టర్ల లబ్ది కోసం మునిసిపాలిటీ ఆదాయానికి గండి కొట్టే విధంగా ప్రవర్తించలేదని కొండారెడ్డి అన్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వలన వర్షాభావ పరిస్థితులలో 3వేల ఎకరాలలో పంట సాగు చేసుకునే విధంగా చర్యలు చేపట్టామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పలు సాంకేతిక సమస్యతో చేయలేకపోయినట్లు ఆయన తెలుపుతూ, భవిష్యత్ తరాలకు లబ్ధి చేకూర్చేలా తన తండ్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారే తప్ప ఏనాడు అభివృద్ధికి ఆటంకపరిచే విధంగా ప్రవర్తించలేదని గుర్తు చేశారు.
Comments