వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
పాలకుడిగా కాదు ఒక సేవకుడిగా ప్రజలకు సేవ చేయాలని, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలలో నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
గురువారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని రెండవ వార్డు, ఏడవ వార్డు, ముప్పై ఒకటవ వార్డులలో నూతన సిసి రోడ్లు, కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే రాచమల్లు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి సారించి వార్డులలోని సమస్యలను సత్వరం పరిష్కరించడానికి ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు సమకూర్చారని, అందులో భాగంగానే నేడు రెండవ, ఏడవ, 31 వ వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహిస్తున్నామని అన్నారు. దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో ఏడవ వార్డు నందు త్రాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలించామని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే ధ్యేయంగా ప్రజలకు పారదర్శకంగా పథకాలను అమలు చేస్తున్నామని, భావితరాలకు ఆదర్శ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పేరు చిరస్మరణీయంగా నిలిచిపోనున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, పలువురు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments