వైభవోపేతంగా గ్రామ దేవతలకు పొంగళ్ళు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
మండల పరిధిలోని భువనగిరి పల్లె గ్రామంలో ఆదివారం గ్రామ దేవతలకు పొంగళ్ల కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.
గ్రామ పెద్దలు పూల హరిప్రసాద్, నామాల రాజా, కావేరి గారి వెంకటరమణ, కంబాయి గారి సుబ్బ నరసయ్య, మన్నేరు లక్ష్మీనరసయ్య, కొమ్మూరు సుబ్బ నరసయ్య మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గంగమ్మ, ఎల్లమ్మ, కనక దుర్గమ్మ, అంకాలమ్మ లకు ఆదివారం విశేష అలంకరణలు చేసి అభిషేకము, కుంకుమార్చన నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం మహిళలు పొంగుబాళ్లతో దేవతలను భక్తిశ్రద్ధలతో అర్చించారు. అనంతరం విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతి ఏటా శివరాత్రి అనంతరం మూడవ ఆదివారం భువనగిరి పల్లి గ్రామానికి నలువైపులా ఉన్న గ్రామదేవతలకు పొంగుబాలు పెట్టుకుని భక్తిశ్రద్ధలతో అర్చించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. భువనగిరి పల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారికి తోబుట్టువులుగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువులుగా గ్రామ దేవతలు తమ గ్రామంలో కొలువై ఉన్నారని ఇక్కడి ప్రజల విశ్వాసం. పూర్వీకుల నుంచి గ్రామ దేవతలను భక్తి శ్రద్దలతో పూజించి పొంగుబాళ్ళు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలియజేశారు.
Comments