లోన్ యాప్ ల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి కే.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, ఐ.పి.ఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయాన్ని నవంబరు 14న సందర్శించి, మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, లోను యాప్ ల మోసాలను నియంత్రించేందుకు పోలీసు శాఖ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నదన్నారు. లోను యాప్ ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవగాహన లేకుండా వారు అడిగే వాటన్నింటికి అనుమతులు ఇవ్వొద్దన్నారు. రుణాలు తీసుకొనే క్రమంలో వారు అడిగిన వాటన్నింటికి అనుమతులు ఇవ్వడంతో మన ఫోటోలు, లొకేషను, కాంటాక్ట్ నంబర్లు తదితర డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళి పోతుందన్నారు. ఇలా పొందిన డేటాతో వారు రుణగ్రహీతల ఫోటోలను మార్ఫింగ్ చేసి, బెదిరింపులకు పాల్పడుతూ, అధిక వడ్డీలతో మంజూరు చేసిన రుణాలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. బ్యాంకు అధికారులు కూడా అనధికార వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలోను అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ఖాతాలపై నిఘా పెట్టాలన్నారు. రుణ యాప్ల వేధింపులు కారణంగా ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సకాలంలో ఫిర్యాదు చేస్తే, వారిపై చర్యలు చేపడతామన్నారు.
ఈ మీడియా సమావేశంలో శాంతిభద్రత విభాగం అదనపు డిజి డా. రవిశంకర్ అయ్యన్నార్, విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎస్. హరికృష్ణ, జిల్లా ఎస్పీ ఎం. దీపిక పాటిల్ పాల్గొన్నారు.
Opmerkingen