ఉపాధ్యాయుడిపై కుక్క దాడి
వరుస ఘటనలతో భయాందోళనలలో ప్రజలు
పురపాలక అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
పట్టణంలో కుక్కల బెడద ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. గత నాలుగు నెలలుగా పట్టణంలో కుక్కల సంచారం తీవ్రంగా ఉంటోంది. ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. మంగళవారం నలంద పాఠశాల వద్ద ధనుష్ అనే ఆరేళ్ల పిల్లాడిని పిచ్చికుక్క తీవ్రంగా గాయపరిచిన ఘటన మరువకముందే బుధవారం మరొక వ్యక్తి కుక్కకాటుకు గురయ్యాడు.
రాజు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చౌడయ్య పట్టణంలోని వైయస్సార్ నగర్ లో నివాసముంటున్నాడు. బుధవారం ఉదయం టీ తాగడం కోసం ఇంటి నుంచి కిందకు దిగివచ్చిన చౌడయ్యను పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరుస కుక్కల దాడుల ఘటనలతో పట్టణ ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి. మంగళవారం జరిగిన ఆరేళ్ల బాలుడిపై పిచ్చికుక్క దాడి ఘటనలో తీవ్రంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి వెంటనే పిచ్చి కుక్కను పట్టి దూర ప్రాంతాలకు తరలించడమే కాకుండా బుధవారం నుంచి కుక్కల పైన పట్టణ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఇంతలోనే మరొక యువకుడిపై కుక్క దాడి చేయడంతో తమ పిల్లల్ని పాఠశాలలకు పంపించడానికి కూడా తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. రాజంపేట పట్టణంలో స్వైర విహారం చేస్తున్న కుక్కల పైన, వాటి దాడి ఘటనల పైన వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాలు గత నాలుగు నెలలుగా మొత్తుకుంటున్నా మున్సిపల్ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అందువల్లనే పట్టణంలో వరుస కుక్కల దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పూర్తిస్థాయి చర్యలు చేపట్టి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
Comentarios