మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు - ప్రొద్దుటూరు పోలీసులు
కడప జిల్లా, ప్రొద్దుటూరు
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఫైన్ ల రూపంలో కొరడా జులుపించనున్నారు ప్రొద్దుటూరు పోలీసులు. గత కొద్ది కాలంగా ఆకతాయిలు, అల్లరి మూకలు, యువకులు అర్ధరాత్రి వరకు మద్యం సేవించి రోడ్లపై హల్చల్ చేస్తూ వివాదాలకు, ప్రమాదాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నేటి నుండి ప్రొద్దుటూరు పోలీసులు మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠినంగా వ్యవహరించబోతున్నారు. పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటన క్రింది విధముగా ఉన్నది :
ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో, రహదారి ప్రమాదాలు నివారణ చర్యలలో భాగంగా, ప్రొద్దుటూరు పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును. నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనములు నడిపిన వారిపై 185. ఎం వి యాక్ట్. ప్రకారము మొదటి సారి పట్టుబడితే కోర్టు పదివేల రూపాయలు జరిమానా మరియు ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధిస్తుంది. రెండవసారి పట్టుబడితే పదిహేను వేల రూపాయలు జరిమానా మరియు రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా రెండూ కోర్టు విధిస్తుంది. అంతేకాకుండా అధిక శబ్దంతో కూడిన సైలెన్సర్లు బిగించి బైకులు నడిపే వారిపైన అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనాలు నడిపే వారి పైన, మైనర్లు వాహనాలు నడిపినచో వారి తల్లిదండ్రులు లేదా గార్డియన్ల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును. లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును. అని తెలియజేశారు.
Comments