హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు
అప్పుడెప్పుడో హైదరాబాద్ రోడ్లపై తిరుగాడిన డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ కనువిందు చేయనున్నాయి. పర్యాటకులకు మధురానుభూతిని పంచనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు నగర రోడ్లపై పరుగులు పెట్టిన ఈ బస్సులు ఆ తర్వాత ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. నిర్వహణ భారం కారణంగా ఆర్టీసీ వీటిని ఒక్కొక్కటిగా సర్వీసు నుంచి తప్పించింది. దీంతో డబుల్ డెక్కర్ బస్సులు చరిత్ర పుటల్లోకి చేరాయి. మళ్లీ ఇన్నాళ్లకు వీటిని తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది 10 డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వంతెనలు, ఆటంకాలు లేని రూట్లలో వీటిని నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఈ ఏడాది 300, వచ్చే ఏడాది 310 మొత్తంగా 610 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి సమకూరనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీటిని నడిపిస్తారు. ఈ బస్సుల్లో 10 డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి. డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్టీసీ గతంలోనే టెండర్లు ఆహ్వానించింది. తొలుత వీటిని అశోక్ లే ల్యాండ్ సంస్థ ద్వారా కొనాలని భావించింది. అయితే, ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ. 2 కోట్లకు పైగానే ఉండడం, కేంద్రం ఇచ్చే రాయితీ రూ. 30 లక్షలకే పరిమితం కావడంతో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. అయితే, ఇప్పుడు వీటిని అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఆర్టీసీకి అందనున్న 310 బస్సులు అద్దె ప్రాతిపదికన సమకూర్చుకుంటున్నవే కావడం గమనార్హం.
Kommentare