శాంతిభద్రతలు కాపాడటానికి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాం - డి.ఎస్.పి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఈనెల 13వ తేదీన జరిగిన ఎన్నికలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలీసులకు సహకరించిన తీరును అభినందిస్తూ, జూన్ 4వ తేదీన జరుగు ఎన్నికల లెక్కింపు సమయం వరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శాంతిభద్రతలకు ఎటువంటి భంగం వాటిల్లినా, వారు ఎంతటి వారైనా నిష్పక్షపాతంగా వ్యవహరించి కఠినంగా వ్యవహరిస్తామని ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్ ఘాటుగా హెచ్చరించారు.
జిల్లా ఉన్నతాధికారుల సూచనలు సలహాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన ట్రబుల్ మాంగ్లర్స్ ను స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, అనవసరంగా ఘర్షణలకు దిగటం, ఘర్షణలను ప్రోత్సహించటం సహించబోమని, ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అనుచరులు, కార్యకర్తలు అనవసర ఘర్షణలకు పాల్పడితే చూస్తూ ఊరుకుండబోమని, ఇందులో అన్ని పార్టీలకు చెందిన వారు ఉండవచ్చునని, ఏ ఒక్క పార్టీ నాయకులను కాని కార్యకర్తలను గాని తాము ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించే పరిస్థితి ఉండబోదని, తెలిసి చేస్తే శిక్ష పడుతుందని, తెలియక చేస్తే తప్పని హెచ్చరిస్తామని హితువు పలికారు. ప్రొద్దుటూరులో ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కౌన్సిలింగ్ లు కొనసాగుతాయని, గ్రామీణ ప్రాంతాలలో కూడా అక్కడి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎలాంటి ఘర్షణలకు తావివ్వొద్దని, వారికి కూడా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీకాంత్, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటరమణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comentarios