వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో డ్వాక్రా మహిళా సంఘాల అకౌంట్లో రుణాలు గోల్మాల్ అవుతున్న నేపథ్యంలో, పలు కేసులు నమోదు అవుతుండగా, తాజాగా ప్రొద్దుటూరు టిడిపి మహిళా అధ్యక్షురాలు భోగాల లక్ష్మీ నారాయణమ్మ కుమార్తె లలిత ఆర్పీగా వ్యవహరిస్తున్న 24 డ్వాక్రా సంఘాలకు చెందిన రుణాలు గోల్ మాల్ చేశారంటూ డ్వాక్రా సంఘాల మహిళలు వసంతపేటలోని ఆమె ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు.
పూర్తి వివరాలలోకి వెళితే గత కొద్ది సంవత్సరాల కాలంగా లలిత డ్వాక్రా సంఘాల ఆర్పీగా వ్యవహరిస్తోందని, దీనిని ఆసరా చేసుకున్న ఆమె 24 డ్వాక్రా సంఘాలకు చెందిన గ్రూపులలో దాదాపు 30 లక్షల రూపాయల మేర అవినీతికి పాల్పడి రుణాలు గోల్మాల్ చేసిందని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు కొందరు ఆమె ఇంటి వద్దకు వెళ్లి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా, లలితా, ఆమె భర్త తమపై భౌతిక దాడికి దిగి అసభ్య పదజాలంతో దూషించారని, ఒకానొక సందర్భంలో బాహాబాహీకి దిగారని, దీన్ని ప్రతిఘటిస్తూ ఇంటి ముందు తాము ధర్నా చేపట్టామని బాధితురాలు చెబుతోంది. విషయం తెలుసుకున్న పలువురు మహిళలు, మహిళా సంఘాల నాయకురాళ్లు అక్కడికి చేరుకొని వారికి మద్దతుగా నిలిచారు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేయగా, భీష్ముంచుకు కూర్చున్న బాధిత మహిళలు తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని కరాకండిగా తెలిపారు. పరిస్థితి తీవ్రస్థాయిలో తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు ఏఎస్పి ప్రేరణ కుమార్ ఐపీఎస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసి ధర్నాను విరమింప చేశారు. అనంతరం బాధిత మహిళలు స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకుని కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు.
ధర్నా జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్కార్పియో వాహనాన్ని పాక్షికంగా ఆందోళనకారులు ధ్వంసం చేశారు, దీనిపై టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ ఏటువంటి కేసు నమోదు చేయకపోవటం ఇక్కడ గమనార్హం. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకోవడంతో అటు టిడిపి నాయకులు, ఇటు వైసీపీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని వాస్తవాలను బేరీజు వేస్తున్నారు. బుధవారం రాత్రి టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
Comments