బాలినేని బ్లాక్ మెయిల్‌పై వైసీపీ కీలక నిర్ణయం!
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి బ్లాక్ మెయిల్‌కు లొంగొద్దని వైసీపీ అధిష్టానం గట్టి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బాలినేని వల్ల వైసీపీకి నష్టమే తప్ప, ఎలాంటి లాభం లేదనే అభిప్రాయానికి ఆ పార్టీ పెద్దలు వచ్చినట్టు తెలిసింది. తరచూ బాలినేని అలకపాన్పు ఎక్కడంపై వైసీపీ అసహనంగా వుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బాలినేని సమీప బంధువు. బాలినేనికి మొదటి నుంచి సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు.
అయితే మంత్రి పదవి నుంచి తప్పించిన మొదలు బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించడం బాలినేనికి పుండు మీద కారం చల్లినట్టైంది. మంత్రి సురేష్‌తో బాలినేనికి విభేదాలున్నాయి. అలాంటిది సురేష్‌ను కొనసాగిస్తూ, తనను తొలగించడాన్ని బాలినేని అవమానంగా భావించారు. ఇటీవల సీఎం జగన్ మార్కాపురం పర్యటనలో బాలినేనికి అవమానం జరిగింది.
సీఎం హెలీప్యాడ్ వద్దకు బాలినేని వాహనాన్ని అనుమతించలేదు. ఇదంతా మంత్రి సురేష్ ఉద్దేశపూర్వకంగానే చేశారని బాలినేని ఆగ్రహించారు. ఈ సందర్భంగా బాలినేని అలకబూనారు.
Comments