ప్రజలకు షాక్ ఇచ్చిన బాబు - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గడచిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు కట్టబెట్టిన ప్రజలకు, విద్యుత్ చార్జీలు పెంచి ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలలో భాగంగా రానున్న ఐదు సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో ఎటువంటి విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి ప్రజల వద్ద ఓట్లు దండుకున్నాడని, అయితే నవంబర్ ఒకటో తేదీ నుండి విద్యుత్ చార్జీలు పెంచనున్నట్లు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తున్నట్లు? ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు? విద్యుత్ ఛార్జీలు తగ్గించని నేపథ్యంలో వైసిపి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఆసన్నమైందని, ఇప్పటికే ప్రజలు విద్యుత్ బకాయిల మోతతో సతమతమవుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధిక భారం మోపుతోందని అభిప్రాయపడ్డారు.
దీపావళికి గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించి, విద్యుత్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు విద్యుత్ చార్జీలు భారమైనప్పటికీ రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని డిమాండ్ చేశారు. మరో ఐదు సంవత్సరాలు ఇలాగే పరిపాలన కొనసాగితే రాష్ట్ర ప్రజలు అప్పులలో కూరుకుపోతారని అన్నారు. ప్రభుత్వ మెడలు వంచి అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా విద్యుత్ చార్జీలను తగ్గించే విషయమై కరెంటు ఆఫీసుల వద్ద ఉద్యమం తీవ్రతరం చేస్తామని, లేని పక్షంలో దీక్షలకైనా పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, పలువురు కౌన్సిలర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
Comments