ఆ కథనాలు అవాస్తవం - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలో వైసిపి అధికారంలో ఉండగా పార్టీ ద్వారా కౌన్సిలర్లుగా గెలిచిన 40 మందిలో 11 మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరారని, రానున్న మున్సిపల్ ఎన్నికలలో వీరికి టిడిపి టికెట్ ఇచ్చే అవకాశం లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నివాసం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, గత కొద్దిరోజుల క్రితం కొన్ని ప్రముఖ టీవీ చానల్స్ నందు మున్సిపల్ చైర్మన్ పదవి టిడిపి కైవసం అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానం పై వస్తున్న కథనాలు అవాస్తవమని ఆయన అన్నారు. ఇకపోతే చైర్మన్ పదవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి 2025 మార్చి 18 నాటికి నాలుగేళ్లు ముగుస్తుందని, నాడు 40 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలుపుకొని 43 ఓట్లు కలవని 29 మంది కౌన్సిలర్లు లేదా ఆపై ఉంటేనే కౌన్సిల్ రద్దు అవుతుందని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ లను తొలగించాలంటే ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో టిడిపికి 29 మంది సభ్యులు అవసరమని అన్నారు. ప్రస్తుత టిడిపి కౌన్సిలర్ల బలం 19 గా ఉందని మరో పది మంది ఉంటేనే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల పదవులు టిడిపి కైవసం అవుతుందని అన్నారు. మరో 10 మంది కౌన్సిలర్లు టిడిపికి అవసరమని అలాంటి పరిస్థితి తలెత్తితే తమ వైసిపి కౌన్సిలర్లు రాజీనామా కైనా సిద్ధమని హెచ్చరించారు. తాను ఎన్నికలలో ఓటమి చవి చూసినప్పటికీ తన వెంట ఇంకా 22 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు తన వెంట నిలిచినందుకు గర్వంగా ఉందని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. రానున్న ఎన్నికలలో తన వెంట ఉన్న 22 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు తప్పక కౌన్సిలర్ టికెట్ ఇస్తానని భరోసానిచ్చారు. సమావేశంలో చైర్మన్ బీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్ ఖాజా, పలువురు వైసిపి కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Comentarios