ప్రొద్దుటూరు నియోజక వర్గం పంటల సాగుపై ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
రైతులంతా ఐకమత్యంగా సంఘటితం కావాలి.
రైతు సదస్సు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి.
రాబోయే తరానికి వ్యవసాయంపై ఇబ్బందులు లేకుండా రైతులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి , ఆదివారం రాజుపాళెం మండలం వెల్లాల గ్రామం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన రైతు సదస్సులో రైతులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సదస్సులో రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరధరామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు రాజకీయాలకు అతీతంగా, రైతులంతా ఐకమత్యమై తమ సమస్యలను పరిష్కరించేందుకు పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆనాడు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు అమరవీరులు స్వచ్ఛందంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి త్యాగాల వల్ల ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని, అలాంటిది తమ సమస్యల సాధన కోసం రైతులు పోరాటం చేస్తే తప్పేమీ లేదని, పాలకులు నిర్లక్ష్యాన్ని వీడి రైతుల అభ్యున్నతికి పాటుపడాలన్నారు .సాగునీటికి రాజోలి, గుండ్రేవుల నిర్మాణాలను పూర్తి చేసి కేసి కెనాల్ కు స్థిరీకరణ చేయాలన్నారు. ఇంకా అసంపూర్తిగా ఉన్న మైలవరం కాలువలను ఆధునీకరించి ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడాలని,పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులంతా సంఘటితమై ఏదైనా సాధించుకోవాల్సిందే తప్ప ప్రభుత్వాలు వాటి అంతట అవే పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు. అలాగే రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని రైతులను గురించి ఆలోచించాలని, ఇక్కడి వారికి ఏమి చేస్తే మేలు జరుగుతుంది అనే దానిపై ముందుకు వెళ్లాలని సూచించారు. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి సహదేవ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని నీరంతా కళ్ళ ముందరే దిగువకు వెళ్తున్న పట్టించుకునే వారే కరువయ్యారనీ అన్నారు. మాజీ జెడ్పిటిసి సభ్యుడు తోట మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నో కష్టాలకు గురవుతున్న రైతాంగం గురించి పాటుపడేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. పంటలకు సాగునీరు అందించే కాలువలను బాగు చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశం అనంతరం బొజ్జ దశతరామిరెడ్డి రచించిన నీటి అవగాహనే రాయలసీమకు రక్ష పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కార్మికుల సాధన సమితి అధ్యక్షులు వెన్నపూస సుబ్బిరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు నంద్యాల రాఘవరెడ్డి, వై ఎన్ రెడ్డి, మాజీ వెల్లాల దేవస్థానముల చైర్మన్ వెంకటరామిరెడ్డి ,కొర్రపాడు రామచంద్రారెడ్డి ,ప్రతాప రెడ్డి, వెంకటరెడ్డి ,ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
Comments