హామీలు నెరవేర్చని వైసీపీకి ఓటు అడిగే నైతిక అర్హత లేదు - జబీవుల్లా
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ఈనెల 13వ తేదీన జరగనున్న ఎన్నికలలో ప్రజలు తమ అభీష్టం మేరకు వారికి నచ్చిన పార్టీలకు ఓటు వేయవచ్చునని, అయితే రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ, ఇచ్చిన మాటలు నెరవేర్చని పార్టీలకు ఓటు వేయవద్దని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి పట్టణ అధ్యక్షులు జబీవుల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రాష్ట్ర రాజధాని పై ప్రజలకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని, కావున ప్రజలను ఓట్లు అడిగే నైతిక అర్హత వైసిపి కోల్పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
జాతీయ పార్టీలలో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వలన రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు, నిధులు చేకూరుతాయి అన్న ఆకాంక్షతోనే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తుకుదుర్చుకున్నట్లు తెలుపుతూ, ఎక్కడా కూడా ముస్లిం మైనారిటీలకు ప్రస్తుతమున్న నాలుగు శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని బిజెపి చెప్పలేదని, బిజెపితో జగన్ ప్రభుత్వమే చీకటి ఒప్పందం కుదుర్చుకొని బిజెపి పార్లమెంటులో ప్రతిపాదించిన ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతూ వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుంటున్నారని అందుకే ప్రజలు ఈ ఎన్నికలలో వరదను టిడిపి అభ్యర్థిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలుపుతూ, ప్రొద్దుటూరు లాగానే రాష్ట్రంలో కూడా మార్పు రానున్నదని, రానున్న టిడిపి పాలనలో బాబు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తారని భరోసా ఇస్తూ, ఎన్నికలు పూర్తి అవ్వగానే ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజుల రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం ఇక్కడి అందరి నాయకులను ప్రజలను కలుపుకొని వెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ఆయన హితువు పలికారు. సమావేశంలో టిడిపి నాయకులు సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Kommentare