విజయవాడ, 500 రూపాయల నోటేంటీ.. రంగు పోవడమేంటీ అనుకుంటున్నారా.. మరంతే.. నకిలీ నోట్లని క్వాలిటీ లేకుండా చేస్తే రంగుల వెలిసిపోక ఇంకేమవుతాయండీ..!! గత వారం రోజులుగా ఆ ఊర్లో ఏ పక్క చూసినా ఇవే నోట్లు.. ఏవి ఒరిజినలో.. ఏవి నకిలీనో అర్థం కాక చస్తున్నారు ఆ ఊరి ప్రజలు. చిన్న చిన్న షాపులైతే ఓకే.. రూ.500 నోటు తీసుకుని పెద్ద షాపులోకి వెళ్లంగానే ఫేక్‌దని మిషన్ చెప్పేస్తోంది. ఆ నోట్లు తీసుకుని బ్యాంక్‌కు వెళ్లగానే మిషన్ అరవడంతో నోటుపై ఫేక్ అని రాసి.. తిరిగి ఇచ్చేస్తున్నారు.
ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పరిసర ప్రాంతాల్లో జరిగింది. వారం రోజులుగా నకిలీ రూ.500 నోట్లు అధిక సంఖ్యలో ఇక్కడ బయటపడుతున్నాయి. బ్యాంకులు, నకిలీలను గుర్తించే పరికరాలున్న పెద్ద దుకాణాలకు వచ్చేంత వరకు అవి చేతులు మారుతూనే ఉన్నాయి. ఇలా ఎక్కువ సార్లు చేతులు మారిన తర్వాత నకిలీ నోట్లు రంగు వెలిసిపోతోందని.. గట్టిగా వేలుతో రుద్దితే క్రమేపీ తెలుపు రంగుకు మారుతున్నాయని బాధితులు వాపోతున్నారు.
సంక్రాంతి సందర్భంగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా జూదాలు అధిక సంఖ్యలో నిర్వహించడంతోనే ఇవి బయటపడి ఉంటాయని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలు, డైలీ వర్కర్స్, చిరు వ్యాపారుల్లోనే బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకువచ్చిన తర్వాత నోట్లను చెక్ చేసి సిబ్బంది వాటిపై ఫేక్ అని రాస్తుండటంతో.. బాధితులు లబోదిబోమంటున్నారు. అధికారులు చర్యలు తీసుకుని నకిలీ రాకెట్ గుట్టు రట్టు చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
Comments