వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
గంగా కావేరి విత్తనాల కంపెనీ నిర్వాకం
62 ఎకరాలలో పత్తి పంట వేసిన రైతులు దిగుబడి రాకపోగా అప్పుల పాలైన రైతన్న
అప్పుకు పత్తి విత్తనాలు ఇచ్చి దిగుబడిని తమకే అమ్మాలని హుకుంజారి
ఎమ్మెల్యే రాచమల్లు చొరవతో శాంతించిన రైతన్నలు
ప్రొద్దుటూరు మండలం, గోపవరం పంచాయతీ నక్కల దిన గ్రామంలో గంగా కావేరి కంపెనీ పత్తి విత్తనాలు వాడి, దాదాపు 62 ఎకరాలలో సాగుచేసిన పత్తి పంట చేతికి రాకపోవడంతో, 26 మంది కౌలు రైతులు నష్టాన్ని చెవి చూసి అప్పుల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే, గంగా కావేరి విత్తనాల కంపెనీ నిర్వాహకులు సదరు ఉద్యోగులచే నక్కలదిన్నె గ్రామంలో దాదాపు 26 మంది కౌలు రైతులను తమ కంపెనీ విత్తనాలను వాడమని చెప్పి ఒప్పించి, ఇందుకుగాను వారికి ముందస్తుగా విత్తనాలు అప్పు ఇచ్చి, పంట చేతికి అందిన నాడు కేజీ పత్తి 100 రూపాయల లెక్కన వారికే తిరిగి అమ్మాలని మాట తీసుకున్నారు. కాగా ఉద్యోగుల మాటలు నమ్మి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన రైతులకు ఐదు నెలల పత్తి పంట ఏపుగా పెరిగినా, ఆశించిన దిగుబడి చేతికి రావటం దేవుడెరుగు కనీసం ఎకరాకు ఒక మూట కూడా పత్తి దిగుబడి రాలేదని, తాము పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు అయి అప్పులు మిగిలాయని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇదిలా ఉండగా స్థానిక వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకుపోగా, వ్యవసాయ అధికారులతో చర్చించిన ఆయన కంపెనీ విత్తనాలలో లోపమని సాంకేతిక నిపుణులు మరోమారు అధ్యయనం చేయవలసి ఉన్నదని, నాణ్యత లోపాలు సరైన ప్రమాణాలు పాటించక పత్తి విత్తనాలను రైతులకు అమ్మటం తగదని హితువు పలికారు. రైతులు ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ వారిని ఆశ్రయించడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు, సరాసరి రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకొని అక్కడి రైతులతో మాట్లాడి గంగా కావేరి విత్తనాల కంపెనీ వారిని పిలిపించి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. తన వంతు ప్రయత్నంగా, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు కంపెనీ ద్వారా నష్టపరిహారాన్ని అందించే ప్రయత్నం తప్పక ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
Comments