అకాల వర్షం అపార నష్టం - నిరాశ తో దిగాలు పడ్డ రైతన్న - మామిడి కి నష్టపరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి.
గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండా మరియు ఉక్కపోత లతో విసిగివేసారిన జనానికి నిన్న అకాలంగా కురిసిన వర్షాలతో కాస్త ఉపశమనం కలిగినప్పటికీ అందరికీ అన్నం పెట్టే రైతులకు మాత్రం తీవ్రమైన నష్టాన్ని చేకూర్చింది.
అకాల వర్షానికి తీవ్రమైన పెనుగాలులు తోడవడంతో ఏపుగా పెరిగిన బొప్పాయి, అరటి మరియు తక్కువ దిగుబడితో అంతంత మాత్రమే కాపు ఉన్న మామిడి పూర్తిస్థాయిలో దెబ్బ తిన్నదని రైతులు వాపోతున్నారు.
పూర్తిస్థాయిలో వరి పంట అయి ఉండడంతో చిట్వేలు మండల పరిధిలోని రాజుకుంట మాదినేని సుబ్బరాయుడు అనే రైతు వరి ధాన్యాన్ని నిన్నటి రోజున ఇంటికి చేర్చే క్రమంలో పొలం నందే ధాన్యం తడిసి ముద్దయింది.
కాగా 50 శాతం మాత్రమే ఎదిగిన నీలం, బెంగళూరు,బెనిషా,రుమాని ఇతర మామిడి రకాల కాయలు పూర్తిస్థాయిలో రాలిపోవడం తో చెట్ల క్రింద కుప్పలుతెప్పలుగా రాశులు పోసి రైతులు మదనపడుతూ అప్పుల ఊబి నుంచి ఎలా గట్టెక్కాలి అబ్బా అంటూ ఆలోచనలో పడ్డారు.
అధికారులు మాత్రం అరటి బొప్పాయి పంటలకు మాత్రమే నష్ట పరిహారం ఉందన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చి ఉన్నాయని మిగిలిన ఏ పంటలకు పరిహారం విషయంలో మాకు సూచనలు సమాచారం లేదని అంటున్నారు. ఎకరా అరటి పంటకు 25000, బొప్పాయి పంటకు 15000 లను నష్టపరిహారం కింద ప్రభుత్వం వారు అందిస్తారని మండల వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.
అయితే దుక్కి మొదలు చీడపీడల పురుగుమందులు తడిసి మోపెడు అయిన మామిడి రైతన్న... ప్రజా ప్రతినిధులు అధికారులు మా కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ద్వారా తగు న్యాయం చేయాలని మూకుమ్మడిగా వాపోతున్నారు.
Comments