వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
నేడు స్థానిక మునిసిపల్ ఒకటవ వార్డు నందు 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆ వార్డు కౌన్సిలర్ శ్రీమతి పండింటి సరోజమ్మ, వైసీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, గోన ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డులోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఆవరణంలో కార్యక్రమాన్ని నిర్వహించగా, వార్డులోని లబ్ధిదారులు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ వార్డు ప్రజలకు గత మూడు సంవత్సరాల నుండి తమ ప్రభుత్వం సంక్షేమ పధకాల ద్వారా అందించిన లబ్ది దాదాపు పది కోట్ల నలభై ఆరు లక్షలని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాల అమలులో పారదర్శకంగా వ్యవహరిస్తోందని, లంచగొండితనం, అవినీతి, దళారీ వ్యవస్థ తమ ప్రభుత్వ హయాంలో లేవని, లబ్ధిదారుని ఖాతాకే సంక్షేమ పధకాల నిధులను వాలంటరీ వ్వ్యవస్థ ద్వారా జమ చేస్తున్నామని, ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించటమే ప్రధానోద్దేశమని, ఏ ఇంటికి ఎన్ని పథకాలు వచ్చాయన్నది తమ ప్రభుత్వంలో చూపిస్తున్నామన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చి నేడు 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం ద్వారా నాయకులు, అన్ని శాఖల అధికారులతో మీ ముందుకు వచ్చానని, ఇలాంటి కార్యక్రమాలు ముందున్న ఏ ప్రభుత్వం చేయలేదని గుర్తుచేశారు. అనంతరం నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివని, తమ ప్రభుత్వ పరిధిలో విద్యుత్, మునిసిపాలిటి పన్నులు, చెత్త పన్నులు మాత్రమే ఉండగా, నిత్యావసర సరుకుల ధరలు ఏపీ తో పోలిస్తే పక్క రాష్ట్రాలలో ఎక్కువ అని ధరలు బేరీజు వేసి వివరించారు. విద్యుత్ చార్జీల పెంపు పై వివరణ ఇస్తూ నియోజకవర్గంలోని దాదాపు ఆరు వేల మంది దళితులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వంపై బురద చల్లే మాటలతో టీడీపీ తన ఉనికిని కోల్పోతోందని, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలపై అపోహలు సృష్టించి ప్రజలను పక్కద్రోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని, తాము టీడీపీ కి ఓట్లు వేసిన వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని, చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం వారి కార్యకర్తలకు మాత్రమే మేలు చేశారని, నేడు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరికి సంక్షేమ పధకాలు అందించటంలో జగన్ ప్రభుత్వం ముందుందని తెలిపారు.
వైసీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ వార్డులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. వార్డులోని ప్రతి ఇంటికి సంక్షేమ పధకాలు దాదాపు అమలయ్యాయని వీటిపై త్వరలో సంక్షేమ పథకాలు లిస్ట్ తయారు చేసి ఇంటింటికీ లిస్ట్ పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమాలు, మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్లు పాతకోట బంగారు మునిరెడ్డి, ఖాజా, వార్డు కౌన్సిలర్ పండింటి సరోజమ్మ, ముఖ్య నాయకులు గోనా ప్రభాకర్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, వార్డులోని ప్రజలు పాల్గొన్నారు.
Comments