విజయవాడలో ఘన సన్మానం అందుకున్న గంగనపల్లి వెంకటరమణ
రాజంపేట, విజయవాడ పి.బి. సిద్ధార్థ కళాశాల రాజరాజ నరేంద్రుని సభా ప్రాంగణంలో జరుగుతున్న 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో రాజంపేటకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు గంగనపల్లి వెంకటరమణ ఘన సన్మానం అందుకున్నారు. దేశ విదేశాలనుంచి సుమారు 1200 మంది తెలుగు రచయితలు హాజరైన ఈ సమావేశంలో తెలుగు భాషను కాపాడుకోవడంలో రచయితల పాత్ర అనే అంశంపై ప్రధానంగా చర్చించారు. భాషా ప్రాముఖ్యతను గురించి సామాన్యులకు సైతం తెలియజేసేలా రచనలు చేస్తూ తెలుగు ప్రజలలో చైతన్యం తీసుకురావాలని అభిలాషించారు.
ఈ సందర్భంగా గంగనపల్లి వెంకటరమణ "దేశభాషలందు తెలుగు లెస్స" అంటూ పీ.వీ. నరసింహారావు వేదికపై పద్య కవితలను వినిపించారు. మహాసభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జివి పూర్ణచందు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి కొలకలూరి ఇనాక్ తదితరుల చేతుల మీదుగా ఆయన జ్ఞాపిక, ప్రశంసా పత్రము, మహాసభల ప్రత్యేక సంచికలను అందుకున్నారు. ఈ సందర్భంగా గంగనపల్లి వెంకటరమణ మాట్లాడుతూ మాతృభాషను కాపాడుకోవడం ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు వారిపై ఉందని చెప్పారు. అప్పుడే తెలుగు భాష పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments